మా ఆవిడంటే అస్సలిష్టం లేదు.. అందుకే ఇలా.. 7లక్షల నాణేలు..

ఇష్టంలేని వ్యక్తిపై కోపం ప్రదర్శించాలంటే ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కలిసి కాపురం చేస్తారనుకున్న ఎన్నో జంటలు ఏవో చిన్న చిన్న కారణాలకే గొడవలు పడుతుంటారు. అవి చినికి చినికి గాలివానై విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. కొన్ని సంవత్సరాలపాటు ఆ కేసు నడిచి చివరికి కోర్టు భర్త నుంచి భార్యకు కొంత భరణం ఇప్పిస్తూ విడాకులు మంజూరు చేస్తుంది. చేసేది చిన్న ఉద్యోగమైనా కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవలసిందే.

లేకపోతే మరోసారి కోర్టు, గొడవలు.. ఇదంతా ఎందుకని అడిగినంతా ఇచ్చేస్తుంటారు బాధిత భర్తలు. ఇండోనేషియాకు చెందిన డ్వి సుసిలార్టో అనే వ్యక్తి అతని భార్య హెర్మి సెత్యోవాటి‌తో గొడవ విడాకులకు దారితీసింది. 9 ఏళ్ల క్రితమే భార్యా భర్తలు విడిపోయారు. భరణం చెల్లింపు ఒప్పదం మీద కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే 9 ఏళ్లుగా ఏదో ఒక సాకు చెబుతూ భరణం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు.

చేసేది చిన్న ఉద్యోగం.. నాకే డబ్బులు సరిపోవట్లేదు.. పెద్ద ఉద్యోగం వచ్చాక ఇస్తానంటూ చెప్పి అప్పటికి గండం నుంచి బయట పడుతున్నాడు. ఇలా చూసి చూసి ఇక భరించలేక మళ్లీ కేసు వేసింది హెర్మి.. భర్త భరణం ఇవ్వడం లేదంటూ. అవమానం భరించలేని సుసిలార్టో తెలిసిన వారందర్నీ డబ్బు సాయం అడిగాడు.

వారంతా నాణేల రూపంలో సాయం అందించడంతో ఆ మొత్తాన్ని 10500 డాలర్లు (సుమారు రూ.7,33,586) తీసుకొచ్చి ఆమె లాయర్ ముందు పెట్టాడు. వాటిని చూసిన లాయర్‌కి ఒక్క సారిగా తిక్క రేగింది. సుసిలార్టోని కొట్టాలన్నంత కోపం కూడా వచ్చింది. కావాలని చేయలేదు సారూ.. సాయం కోరితే వాళ్లు ఇచ్చిన మొత్తం ఇది అనేసరికి లాయర్ హృదయం కరిగింది. సిబ్బంది సహాయంతో వాటిని లెక్కపెట్టించి బాధితురాలకి అందజేసారు. ఆమె కూడా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని కామ్‌గా కాయిన్స్‌ని తీసుకెళ్ళిపోయింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -