నానీ అన్నకు రాఖీలు.. బిగ్‌బాస్ చెల్లెళ్లు..

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వంద రోజులు.. అన్ని పండగలు అక్కడే. డేటు, డే కూడా తెలియకుండా నాలుగ్గోడల మధ్యే గడపాలి. ఈ రోజు ఈ పండగ అని బిగ్ బాస్ చెబితేనే తెలుస్తుంది. అందమైన బిగ్‌బాస్ హౌస్ అనే అండర్ గ్రౌండ్‌లో అందరికీ దూరమైనట్టే ఉంటారు హౌస్‌లోని వారు. కానీ వారిని ప్రతిరోజు గమనిస్తూ వారి గురించే మాట్లాడుకుంటూ, ఓట్లేసి కొందరిని గెలిపిస్తే, కొందరని ఎలిమినేట్ చేస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులతో మమేకమయ్యారు హౌస్‌లోని సభ్యులు.

 

మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మన ఇంట్లో వారి గురించి మాట్లాడుకునేంత దగ్గరయ్యారు. నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నానీ హౌస్‌లోకి వెళ్లి సరదాగా వారితో గడిపారు. ఇంటిలోని అమ్మాయిలు పూజ, గీత, శ్యామల, దీప్తిలచేత రాఖీలు కట్టించుకుని అన్న ప్రేమని పంచారు. అన్నగా వారికి బహుమతులు ఇచ్చి ఆనందాన్ని తీసుకువచ్చారు. నానీ ఓ యాక్టర్ అన్న విషయం మరచిపోయి వారితో పాటు కబుర్లు చెప్పారు. ప్రేమ, ఆప్యాయతలను సభ్యులతో పంచుకున్నారు. పూజ రామచంద్రన్ ఎలిమినేషన్‌తో ఎపిసోడ్ ముగిసింది.