
బీజేపీ పాలనలో దేశంలోని కీలక వ్యవస్థలన్నీ నాశనం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అటకెక్కించారని.. స్కాలర్షిప్లను ఆపేశారని మండిపడ్డారు. పేదలు గొంతెత్తితే భౌతికదాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా… అనిల్ అంబానీ లాంటి వ్యక్తులకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ రాహుల్ నిప్పులు చెరిగారు.
విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ… సంచలన ఆరోపణలతో భారత రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నారు. మొన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌తో ఆర్ఎస్ఎస్ను పోల్చిన రాహుల్… ఇప్పుడు లండన్ టూర్లో విమర్శల వాడి మరింత పెంచారు.
లండన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ… మరోసారి ప్రధానిపై విరుచుకుపడ్డారు. ఉన్నావ్ అత్యాచారం, పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ కేసులపై ఇంతవరకు ప్రధాని ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరిట దేశాన్ని విడదీస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, ఆర్బీఐ వ్యవహారాల్లో కేంద్రం పదేపదే జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. మోడీ హయాంలో అనిల్ అంబానీ వంటి వాళ్లు తప్ప ఇంకెవరూ బాగుపడలేదన్నారు. చైనా రోజులో 50 వేల ఉద్యోగాలను సృష్టిస్తుంటే.. భారత్ మాత్రం 450 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతోందని విమర్శించారు.
మరోవైపు తమ కుటుంబం గాంధీ ఇంటి పేరును వాడుకోవడంపై… యూకేలో రాహుల్‌గాంధీ స్పష్టత ఇచ్చారు. మీకు గాంధీ ఇంటి పేరుంది.. ఇంతకంటే ఏం కావాలంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు రాహుల్ స్పందించారు. తనను సామర్థ్యం ప్రకారం అంచనా వేయాలని.. గాంధీ ఇంటి పేరు చూసి కాదని స్పష్టం చేశారు.
గతేడాది అమెరికా పర్యటనలో కూడా రాహుల్ వారసత్వ రాజకీయాలపై స్పందించారు. అసలు ఇండియా మొత్తం వారసత్వ రాజకీయాలపైనే నడుస్తుందని వ్యాఖ్యానించి… అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు మూటగట్టుకున్నారు. అయితే ఈసారి మాత్రం ఆయన నేరుగానే సమాధానమిచ్చారు.