తేళ్లతో నైవేద్యం అక్కడ ప్రత్యేకత

Scorpions Offered to God in Kurnool

శ్రావణ మాసంలో సోమవారం ప్రత్యేకమైంది. భక్తులు శివాలయాలకు వెళ్లి భోళాశంకరుడికి అర్చనలు, అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. పండ్లు, పాలు, పాయసాన్ని నేవేద్యంగా సమర్పిస్తుంటారు. అయితే కర్నూలు జిల్లాలోని ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. మిగతావారికి భిన్నంగా అక్కడి వారు కొండలరాయుడికి తేళ్లతో నైవేద్యం సమర్పిస్తారు.

శ్రావణమాసం మూడో సోమవారం వచ్చిందంటే కోడుమూరు కొండపై సందడే సందడి. భక్తులు విషపురుగులైన తేళ్ల కోసం కొండపై వెతుకుతారు. చిన్న, చిన్న రాళ్లను ఎత్తి ఎలాంటి జంకుబొంకులేకుండా తేళ్లను చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఆచారం దశాబ్దాలుగా వస్తోంది.

పూర్వం కోడుమూరులో సౌరెడ్డి, అన్నపూర్ణ దంపతులు ఉండేవారు. వరుసగా వారికి ఆడ సంతానమే కలిగింది. దీంతో వారు మగ సంతానం కలిగితే తేళ్లతో నైవేద్యం పెడ్తామని కొండలరాయుడికి మొక్కుకున్నారట. ఆ తర్వాత సౌరెడ్డి దంపతులకు మగబిడ్డ పుట్టారు. దీంతో వారు తేళ్లు నైవేద్యం సమర్పించి మొక్కు చెల్లించకున్నారు.

అప్పటినుంచి ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే మూడో సోమవారం కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.