అమ్మా.. నీ రుణం ఇలాగైనా..

నవ మాసాలు మోసి కనిపెంచిన బిడ్డలు పెద్దయ్యాక పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా పట్టెడన్నం పెట్టి, ప్రేమగా పలకరిస్తే చాలు ఆ తల్లికి చెప్పలేని సంతోషం. నలుగురికీ తన బిడ్డల గురించి గొప్పగా చెప్పుకుంటుంది. నాన్న ఎలా ఉంటాడో తెలియకపోయినా అన్నీ తానై అమ్మే నడిపించింది. ఇద్దరు కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసింది. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా పెంచి పెద్ద చేసింది. కొడుకులిద్దరికీ అమ్మ చూపిన మమకారం, అమ్మ పడ్డ కష్టం ఎప్పుడూ కళ్ల ముందు కదలాడుతుండేది. అమ్మ రుణం తీర్చుకోవాలనుకున్నారు.

వయసు మీదపడడంతో కొండ మీద కొలువై ఉన్న దేవుడిని చూడాలన్న కోరిక ఉన్నా కొడుకులతో చెప్పలేకపోయింది. ఎక్కడెక్కడినించో వస్తున్న భక్తులు ఆ కోదండ రాముడిని దర్శించుకుంటున్నారు. మనసులో మాటని గ్రహించారేమో కొడుకులిద్దరూ అమ్మతో చెప్పారు కోవెలకు తీసుకువెళుతున్నట్లు. ‌వయసు మీదపడడంతో మెట్లెక్కి నడవలేని తల్లిని కావడి తయారు చేసి అందులో కూర్చోబెట్టారు. ఇద్దరు కొడుకులు చెరోవైపు పట్టుకుని మోస్తూ తల్లికి భగవంతుని దర్శనం చేయించారు. కనిపించని దైవాన్ని దర్శించడానికి కనిపెంచిన కొడుకులు మోసుకెళుతుంటే.. మళ్లీ జన్మ ఉంటే మీ కడుపున పుడతాను మీకు బిడ్డగా అంటూ.. ఆ తల్లి ఆనంద భాష్పాలు రాల్చింది.