నా వయస్సు ఎంతనుకుంటున్నారు.. జస్ట్..

ముసిముసి నవ్వులు.. ముడతలు పడ్డ శరీరం.. కంటి చూపు సరిగా కనిపించకపోయినా తనపని తానే చేసుకోవాలన్న ఆరాటం. తన జీవితంలో చూసిన ఎన్నో సంగతులు ఇంకా తన మనోఫలకంలోనే మెదులుతున్నాయంటూ అడిగిన వారికి కాదనకుండా అన్నింటినీ పూస గుచ్చినట్లు వివరిస్తోంది బొలీవియాకు చెందిన ప్లోరెస్ కోల్క్.

అక్టోబర్ 26, 1900న జన్మించిన కోల్క్ ప్రపంచంలోనే పెద్ద వయస్సున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. 118 ఏళ్ల వయసున్న ఈ బామ్మకి పాటలన్నా, జంతువులన్నా చాలా ఇష్టం. జానపద పాటలంటే ఇష్టపడే ఈ బామ్మ గిటార్‌ని వాయిస్తూ అద్భుతంగా పాడుతుంది ఇప్పటికీ. కుక్కలు, పిల్లులను ప్రేమతో దగ్గరకు తీస్తుంది. తనపేరు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నమోదయిందన్న విషయం కూడా తెలియని బామ్మ అక్కడి వారందరికీ ఓ అద్భుత వ్యక్తి.

వయసులో ఉన్నప్పుడు బొలీవియన్ పర్వత ప్రాంతాల్లో గొర్రెలను మేపుతూ, పండ్లు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేది. వాటినే ఆహారంగా తీసుకునేది. తన ఆరోగ్య రహస్యం తనకి ఎంతో ఇష్టమైన కేక్ మరియు గ్లాస్ సోడానే కారణమంటుంది. అవంటే ఎంతో ఇష్టం బామ్మకి. మరో ఆసక్తికర విషయం ఏమంటే బామ్మ బ్యాచిలర్. అందుకే తనకు వారసులు ఎవరూ లేరంటుంది.

రెండు ప్రపంచ యుద్ధాలను, స్థానిక విప్లవాలనెన్నింటినో చూసింది. ఆమె నివసిస్తున్న స్కాబా పట్టణంలో ఒకప్పుడు మూడు వేల జనాభా ఉంటే ఇప్పుడది 1,75000కు చేరుకుంది. ఒక ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న బామ్మ అంటే అక్కడి వారందరికీ ఎంతో ఇష్టం. బామ్మ వారికొక మిరాకిల్. తన చిన్ననాటి సంగతులన్నీ రోజూ వారికి కథలుగా చెబుతుంటుంది. బామ్మ జ్ఞాపకశక్తికి హాట్సాప్ చెబుతుంటారు చుట్టుపక్కల వారు.