నీకోసం మతాన్ని వదిలేసాను..కానీ నువ్వు నన్ను ఒంటరిని చేశావు

అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ప్రియురాలి కోరిక మేరకు తన మతాన్ని కూడా మార్చుకున్నాడు. కానీ చివరికి ఆ అమ్మాయి మనస్సు మార్చుకొని తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయింది. దీంతో ఆ వ్యక్తి ‘నీ కోసం నా మతాన్ని వదిలేసాను నీ తల్లిదండ్రుల కోసం నన్ను ఒంటరిని చేశావంటూ’ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక చేసేది ఏమీలేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మేజర్‌ అయిన ఆ యువతి కోరికను కాదనలేమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తన స్వచ్చమైన ప్రేమ మధ్యలోనే ముగిసిందని కన్నీటి పర్యంతమయ్యాడు.

ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అంజలి జైన్‌(23), మహ్మద్‌ ఇబ్రహీం సిద్ధిఖి (33)లు ప్రేమించుకున్నారు. సిద్ధిఖి వేరే మతానికి చెందిన వ్యక్తి కావడంతో మతం మారాల్సిందిగా అంజలి అతన్ని కోరింది. సిద్ధిఖి ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారాడు. మతంతో పాటు అతని పేరును కూడా మార్చుకున్నాడు .మహ్మద్‌ సిద్ధిఖి కాస్తా ఆర్యన్‌ ఆర్యగా మారాడు. అనంతరం వారు ఫిబ్రవరి 25న హిందూ సాంప్రదాయం ప్రకారం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు.

వివాహం అనంతరం అంజలి తన కుంటుంబ సభ్యులకు విషయం చెప్పి ఒప్పిస్తానని తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళింది. వారు ఒప్పుకోకపోవడంతో అంజలి తిరిగి తన భర్త దగ్గరకు చేరుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అంజలిని ఆమె భర్త దగ్గర నుంచి వేరుచేసి మహిళా పోలీసు కస్టడీకి అప్పగించారు. సిద్ధిఖి చేసేది ఏమిలేక హైకోర్టును ఆశ్రయించాడు.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు అంజలి తన తల్లిదండ్రులతో లేదా ప్రభుత్వ వసతి గృహంలో ఉండవచ్చంటూ తీర్పు చెప్పింది.కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సిద్ధిఖి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం విచారణకు హాజరైన అంజలి తన తల్లిదండ్రులతో కలసిఉండాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. దాంతో సుప్రీం కోర్టు అంజలి మేజర్‌ అయినందున ఆమెకు తనకు ఇష్టం వచ్చిన వారితో ఉండే హక్కు ఉందని తీర్పునిచ్చింది.