అన్ని సర్వేల్లోనూ విజయావకాశాలే కనిపిస్తున్నాయా..?

early-elections-situation-in-telangana

ఢిల్లీ వెళ్లి అంతా చక్కబెట్టిన గులాబీ బాస్
కొంగరకొలాన్ ప్రగతి నివేదిన సభే వేదిక కానుందా?

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ముందుస్తు హడావుడి కనిపిస్తోంది. అన్ని సర్వేల్లోనూ విజయావకాశాలే కనిపిస్తున్నాయని చెబుతున్న కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ముందస్తుకు తొందరపడుతున్నారు. గతంలో కేంద్రంతో కలిసి.. జమిలి ఎన్నికలకు జైకొట్టిన గులాబీ దళపతి.. ఇప్పుడు మాత్రం ముందస్తుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే అంతా చక్కబెట్టిన గులాబీ బాస్.. ఇప్పుడు దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ఆపరేషన్ ను ప్రారంభించారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి జనంలో ఎంత ఆదరణ ఉందో చెప్పడానికి కొలమానంగా.. కొంగరకొలాన్ ప్రగతి నివేదన సభను వేదికగా చేసుకుంటోంది టీఆర్ఎస్. నిజానికి వచ్చే ఏడాది జూన్ 8వరకు కేసీఆర్ సర్కారుకు గడువుంది. అయినా ఇప్పుడు ఎందుకింత తొందరగా పావులు కదుపుతున్నారన్నది ప్రతిపక్షాలకు అంతుబట్టడం లేదు.

ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ అంటున్న కాంగ్రెస్
ప్రతిపక్షాల హామీలు జనంలోకి వెళితే సమస్య అంటున్న టీఆర్ఎస్
ప్రతిపక్షాలకు వాయిస్, ఛాయిస్ లేకుండా చేయడానికే ముందస్తా?

తెలంగాణలో ప్రతిపక్షాలు ఇప్పటికే దూకుడుమీదున్నాయి. గత కొద్ది కాలంగా బస్సుయాత్రలతో పాటు వివిధ సభల ద్వారా ప్రజల మధ్య ఉండేలా జాగ్రత్తపడుతున్నాయి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ కు దీటుగా ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది. అందులో ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయిల రుణమాఫీ అంశం.. టీఆర్ఎస్ సర్కారునూ కలవరపెట్టింది. అందుకే స్వయంగా ముఖ్యమంత్రే.. అది అసాధ్యం అని కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో పాటు నెలకు 3 వేల రూపాయిల చొప్పున నిరుద్యోగ భృతి, 55 ఏళ్లకే పెన్షన్ తో పాటు కుటుంబంలో ఎంతమంది అర్హులుంటే అందరికీ పెన్షన్ అంటూ హామీ ఇచ్చింది. ఈ హామీలు జనంలోకి వెళితే.. చర్చ మొదలవుతుంది. అది ఓట్లపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల లెక్కల్లో తేడాలు వచ్చే ప్రమాదముంది. అందుకే ప్రతిపక్షాలకు ఆ ఛాయిస్, వాయిస్ లేకుండా చేయడమే లక్ష్యంగా.. కేసీఆర్.. ముందస్తు పావులు కదుపుతున్నారు.

అసెంబ్లీలో గెలిస్తే.. లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం సులభం
రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ చక్రం తిప్పే వ్యూహం

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరోసారి పవర్ లోకి రావడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడు ముందస్తు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. తరువాత వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కారును సులభంగా గమ్యానికి చేర్చవచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. దీనివల్ల ఇటు రాష్ట్రంలోను అటు జాతీయస్థాయిలోను చక్రం తిప్పే అవకాశం ఉందన్నది గులాబీదళం వ్యూహంగా కనిపిస్తోంది.

100 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న టీఆర్ఎస్
ఆ 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలా?
సెప్టెంబర్ 10లోపు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే అవకాశం?

రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితిపై ఇప్పటికే పలు సర్వేలు చేయించారు కేసీఆర్. అన్నింటిలోనూ సానుకూల ఫలితాలు వచ్చినట్టుగా శ్రేణులకు కూడా చెప్పారు. 100 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న టీఆర్ఎస్.. దానికి తగ్గట్టే ఎన్నికల ముందు జనాకర్షక పథకాలకు తెరతీసింది. పాజిటివ్ ఓటు పనిచేస్తుందన్న నమ్మకంతోనే.. ముందస్తుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది చివరిలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవేళ సెప్టెంబర్ పదిలోపు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఇక్కడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుంది. అటు కేంద్ర పెద్దల నుంచి ఈమేరకు భరోసా పొందినట్లు తెలుస్తోంది.

మోడీకి కేటీఆర్ హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైందా?
గత 3 నెలల్లో మోడీని కేసీఆర్ 2సార్లు, కేటీఆర్ ఒకసారి కలిశారు

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా పట్టులేదు. కర్ణాటకలో కూడా అధికారం అంది మరీ చేజారింది. అందుకే సౌత్ లో బలం పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా.. దక్షిణాది రాష్ట్రాల మద్దతు అవసరమవుతుంది. అందుకే కేసీఆర్ కు బీజేపీ సర్కార్ సరే అని చెప్పినట్టు సమాచారం. అయితే కేసీఆర్ ను రాజకీయంగా ఎంతవరకు నమ్మచ్చు అన్నదానిపైనే కమలనాథులు ఆలోచించారు. కానీ కేటీఆర్ మోడీకి హామీ ఇవ్వడంతో ఓకే అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే.. గత రెండు నెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీని మూడుసార్లు కలిశారు. కేవలం ఆగస్టు నెలలోనే రెండుసార్లు కలిశారు. కేటీఆర్ ఒకసారి కలిశారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే.. గులాబీదళం ముందస్తుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది.