రేసు గుర్రాలు ఫెర్టిలైజర్‌ షేర్లు

వరుసగా రెండో రోజు సరికొత్త గరిష్టాలను అందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో పటిష్టంగా కదులుతున్నాయి. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఉన్నట్లుండి ఎరువులు, రసాయనాల కంపెనీల షేర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఫెర్టిలైజర్‌ కంపెనీల కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వారం ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను విడుదల చేయనున్నట్లు వెలువడ్డ వార్తలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇవీ వివరాలు…

ధూమ్‌ధామ్‌….
దాదాపు ఫెర్టిలైజర్‌ కంపెనీల షేర్లన్నీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో లాభాల దౌడు తీస్తున్నాయి. జాబితా ఎలా ఉన్నదంటే.. ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌(ఫ్యాక్ట్‌) షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 14 శాతం దూసుకెళ్లింది. 48.25 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50.50 వరకూ ఎగసింది. ఇక సదరన్‌ పెట్రోకెమికల్స్‌(స్పిక్‌) 12 శాతం జంప్‌చేసి రూ. 33.6కు చేరగా, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 167 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 172కు ఎగసింది. ఈ బాటలో నాగార్జునా ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌సీఎల్‌) 9 శాతం పురోగమించి రూ. 13.75ను తాకగా.. రాష్ట్రీయ కెమికల్స్‌(ఆర్‌సీఎఫ్‌) 6 శాతం జంప్‌చేసి రూ. 76కు చేరింది. నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌) సైతం 4 శాతం పెరిగి రూ. 50ను తాకగా.. జువారీ ఆగ్రో 4 శాతం పుంజుకుని రూ. 325 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 330 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ 3 శాతం లాభపడి రూ. 262 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 265 వరకూ ఎగసింది. తొలుత రూ. 418 వరకూ పుంజుకన్న జీఎస్‌ఎఫ్‌సీ సైతం 1.5 శాతం లాభంతో రూ. 414 వద్ద ట్రేడవుతోంది.