రెండో రోజూ డబుల్‌ సెంచరీతో షురూ

kenada-busness-tieup-with-america

ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పంద సమీక్షలో భాగంగా మెక్సికోతో సరికొత్త ఒప్పందాన్ని అమెరికా కుదుర్చుకోవడంతో  దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. కెనడాతోనూ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు నేటి నుంచి ట్రంప్‌ ప్రభుత్వం చర్చలు ప్రారంభించనున్న కారణంగా అమెరికా, ఆసియా స్టాక్‌ మార్కెట్లు  జోరందుకున్నాయి. కాగా… ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డబుల్‌ సెంచరీ చేసింది. 204 పాయింట్లు జంప్‌చేసి 38,898కు చేరింది. నిఫ్టీ సైతం 65 పాయింట్లు ఎగసి 11,757ను తాకింది. వెరసి మరోసారి సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.
అన్నిరంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. మెటల్‌, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ 1-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ దాదాపు 5 శాతం జంప్‌చేయగా.., గెయిల్‌, సిప్లా, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌, వేదాంతా, టాటా మోటార్స్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో టైటన్‌, యస్‌బ్యాంక్‌, హెచ్యూఎల్‌, బజాజ్‌ ఆటో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 1-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.
డెరివేటివ్స్‌ ఇలా
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో జేపీ, జీఎస్‌ఎఫ్‌సీ, బలరామ్‌పూర్‌, రేమండ్‌, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్ 5-1.6 శాతం మధ్య పురోగమించాయి. అయితే మరోపక్క పీఎఫ్‌సీ, అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌సీసీ, ఆర్‌ఈసీ, అదానీ పవర్‌, యూనియన్‌ బ్యాంక్‌, కమిన్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2-0.8 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు అప్‌
మార్కెట్ల ప్రోత్సాహంలో చిన్న షేర్లూ జోరందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.3-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 983 లాభపడగా.. 456 నష్టాలతో కదులుతున్నాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -