కింగ్ నాగార్జున బర్త్ డే స్పెషల్..

king nagarjuna birthday special

– బాబురావు. కామళ్ల

అక్కినేని నాగార్జున .. బార్న్ విత్ సిల్వర్ స్క్రీన్.. నాగేశ్వరరావుగారి సినీ వారసుడిగా వెండితెర ప్రవేశం చేసిన హీరో. మూడు దశాబ్ధాలకు పైగా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు.. ప్రయోగాలూ ఉన్నాయి. కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో, కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు నాగ్.. ఇమేజ్ కు భిన్నమైన సినిమాలు చేయడానికీ వెనకాడడు. నాగార్జున మనకు స్టైల్ ఐకన్ లా కనిపిస్తాడు. ఫిట్ నెస్ మెయింటైన్ చేయాలంటే నాగ్ తర్వాతే ఎవరైనా.. అందుకే ఇన్నేళ్లైనా ఇంకా మన్మథుడులానే కనిపిస్తున్నాడు అంటారు. అందుకు కారణం అతని క్రమశిక్షణే. తండ్రి నుంచి వచ్చిన ఈ గుణం నాగ్ ను తన తరం హీరోల్లో ప్రత్యేకంగా నిలిపింది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన స్టార్ హీరో..నాగ్. శివ, నిన్నేపెళ్లాడతా, అన్నమయ్య వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలన్నీ నాగార్జున డేరింగ్ డెసిషన్ నుంచి వచ్చినవే.

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా .. ఈ విక్రమ్ కు వెంటనే హిట్ దక్కలేదు. మొదట్లో చూడ్డానికి సన్నగా పీల గొంతుతో కనిపించిన నాగ్ ను అసలు ఇతనేం హీరో అనుకున్నారు. కానీ అతనే వెండితెరకు ఎవర్ గ్రీన్ మన్మథుడు అవుతాడని అప్పుడెవరూ ఊహించి ఉండరు. విక్రమ్ తర్వాత వరుసగా సినిమాలన్నీ పోయాయి. ఆఖరుకి శ్రీదేవితో చేసిన ఆఖరి పోరాటం ఆదుకుంది. అది మంచి విజయం సాధించింది. ఇదే నాగ్ కు తొలి కమర్షియల్ హిట్. తర్వాత జానకి రాముడు, విజయ్, విక్కీ దాదా హిట్.. కుర్రాడు బాగా డెవలప్ అయ్యాడు.. తండ్రి పేరు నిలిపే ఛాన్సుంది అనుకుంటున్న టైమ్ లో చేశాడు.. దీన్ని ప్రయోగం.. అనొచ్చో లేదో తెలియదు కానీ, అప్పటికి హీరో అంటే ఉన్న కాలిక్యులేషన్స్ కు క్రాస్ చేసి కాలేజ్ గోయింగ్ కుర్రాడిగా ఉన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డవాడి పాత్ర. పైగా క్యాన్సర్ తో ప్రేమకథ. ఇంకెవరికైనా చెబితే ఎలా రియాక్ట్ అయ్యేవారో కానీ, నాగ్ కు అందులో ప్రేమే కనిపించింది. అందుకే గీతాంజలి అతని కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే ది బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మణిరత్నం తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా గీతాంజలి. ఆ సినిమాకు నాగార్జునను ఎంచుకోవాలని ఎందుకనుకున్నాడో కానీ, గీతాంజలి లాంటి కథతో ఓ ప్రేమకథ చేయొచ్చని మణిరత్నం చేసిన ప్రయత్నం అద్భుతమనే చెప్పాలి. ఇక ఇళయరాజా సంగీతం, పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ, రాజశ్రీ సంభాషణలు గీతాంజలిని ఓ ప్రేమకావ్యంగా మలిచాయి.

హీరో అంటే పేజీల కొద్దీ డైలాగులు చెప్పడం.. ఇస్త్రీ నలక్కుండా పదిమందిని మడతబెట్టడం.. అదిరిపోయే స్టెప్పులేయడం అనే రొటీన్ ఫార్ములాకు చెక్ పెట్టిన ఫస్ట్ హీరో నాగ్. హీరో అంటే సైకిల్ చైను లాగి కూడా కొట్టొచ్చని.. అరుపులు, కేకలు లేకుండా సైలెంట్ గా విలన్ ని బెదిరించవచ్చని శివతో నిరూపించాడు. తెలుగు సినిమా గమనాన్ని ఉలిక్కిపడేలా చేసి ఒక్క ఉదుటున సర్దుకునేలా చేసిన సినిమా…శివ. రామ్ గోపాల్ వర్మ అద్భుత సృష్టికి నాగార్జున పర్ఫార్మెన్స్ తోడై శివను ఎవర్ గ్రీన్ చేశాయి. శివ.. నాగార్జున సినీ జీవితాన్నే కాదు.. తెలుగు సినిమా గమనాన్ని మార్చివేసింది. దర్శకుల్లో సరికొత్త ఆలోచనలకు పునాది వేసింది. కొత్తవారిని ప్రోత్సహిస్తే రిస్క్ మాత్రమే కాదు.. విజయాలూ ఉంటాయని నిరూపించింది. నాగ్ ముందు నుంచీ కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి కారణం ఇదే. ఒక రకంగా చెప్పాలంటే శివ సినిమా తర్వాత తెలగు సినిమా చరిత్ర రెండుగా చీలింది. శివకు ముందు తర్వాత అని. శివ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా కొన్ని ప్రయోగాలూ చేశాడు. కానీ తేడా వచ్చింది. ప్రేమయుద్ధం, నేటి సిద్ధార్థ, శాంతి క్రాంతి, కిల్లర్, ద్రోహి, హిందీలో ఖుదాగవా, రక్షణ లాంటి సినిమాలు చేశాడు.. వీటిలో ఇద్దరూ ఇద్దరేలో తొలిసారి తండ్రితో కలిసి నటించాడు. కానీ మాగ్జిమం మిక్స్ డ్ రిజల్ట్స్ నే చూశాడు. దీంతో పంథాను పూర్తి స్థాయిలో కమర్షియల్ సినిమావైపు మళ్లించాడు. నాగార్జున కమర్షియల్ సినిమాలు చేసినప్పుడూ కాలిక్యులేషన్స్ ను దాటలేదు. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వారసుడు, అల్లరి అల్లుడు, హలోబ్రదర్, ఘరానాబుల్లోడు లాంటి ఊర మాస్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. హలో బ్రదర్ ఇప్పటికీ అన్నదమ్ముల కథకు కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంది. అలాగే ఇవన్నీ సాధారణ కథలతో కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూసంత ఎక్కువగానే కలిపిన మాస్ మూవీస్ కావడం విశేషం. ఇక నాగార్జున ఛాయిస్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపించిన సినిమా నిన్నేపెళ్లాడుతా.. కుటుంబ కథా చిత్రమ్ అంటే అప్పటి వరకూ ఏడుపులూ, సమస్యలే. కానీ కృష్ణవంశీ చెప్పిన కథకు కనెక్ట్ అయిన నాగార్జున తీసుకున్న నిర్ణయం.. ఫ్యామిలీ సినిమాల మీనింగ్ నే మార్చివేసింది. నిన్నేపెళ్లాడుతా తర్వాత తెలుగులో ఆ ట్రెండ్ సినిమాలే చాలా వచ్చాయి.. వస్తున్నాయి. ఆ ట్రెండ్ కు బీజం వేసింది నాగ్.

నాగార్జునకు ఓ ఇమేజ్ ఉంది. మాస్ అయినా క్లాస్ అయినా అది డిఫరెంట్. మరి అలాంటి నాగార్జున భక్తి సినిమాలో నటిస్తే.. ?ఆ ఆలోచన వచ్చింది.. అప్పటి వరకూ రక్తి సినిమాలు తీసిన రాఘవేంద్రరావుకు. అందుకే వీరి కాంబినేషన్ లో అన్నమయ్య అనౌన్స్ అయినప్పుడు అన్నీ విమర్శలే వచ్చాయి. అన్ని విమర్శలకు తన నటనతో సమాధానం చెప్పాడు నాగార్జున. అన్నమయ్యగా ఆ పాత్రకు ప్రాణం పోసి.. భక్తి పాత్రలు చేయడంలో తండ్రి ఎంతటి ఎక్స్ పర్టో తనలోనూ అంతటి ఎక్స్ పర్ట్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. కొన్ని సినిమాల ప్రభావం కెరీర్ పైనే పడుతుంది. అందుకే అన్నమయ్య తర్వాత నాగార్జున చేసిన ఏడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఏ నటుడికైనా ఇది ఓ సంకట స్థితే. కానీ నువ్వు వస్తావనితో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అది కూడా సూపర్ హిట్ కాదు.. కానీ ఉపశమనం. మళ్లీ నువ్వు వస్తావని తర్వాత సంతోషం వరకూ అన్నీ యావరేజ్ సినిమాలే వచ్చాయి. సంతోషం.. నాగార్జునను మన్మథుడిలా తెలుగు తెరకు చూపించిన సినిమా. ట్రెండ్ కు భిన్నంగా.. ఇమేజ్ కు కాస్త దూరంగా చేసిన ప్రయత్నం. అది కూడా ఓ కొత్త దర్శకుడిని నమ్మి. మళ్లీ అతని నమ్మకం ఫలించింది. సంతోషం సూపర్ హిట్.. ఆ వెంటనే మన్మథుడు.. మరో సూపర్ హిట్. దీంతో నాగ్ కెరీర్ కొత్త టర్నింగిచ్చుకుంది..

ఇక హీరోలను ఊర మాస్ గా చూపించడంలో ఎక్స్ పర్ట్ అయిన పూరీతో చేసిన శివమణి మరో కొత్తదనం. నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్ అంటూ నాగ్ చెప్పిన డైలాగులు అమ్మాయిలకూ నచ్చాయి. తర్వాత నేనున్నాను, మాస్.. మళ్లీ హిట్ బాట పట్టాడు నాగ్.. అన్నమయ్య తర్వాత మళ్లీ అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని ఎప్పుడూ అడిగేవారు నాగ్ ను. దీనికి సమాధానం రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. మళ్లీ రాఘవేంద్రరావు కాంబినేషనే. కానీ ఈ సారి ఎవరికీ డౌట్స్ లేవు. అనుకున్నట్టుగా శ్రీరామదాసు సూపర్ హిట్. నాగార్జున నటనా హైలెట్.. ఇప్పుడు నాగార్జున అంటే ఏ పాత్రైనా చేయగల మోస్ట్ టాలెంటెడ్ అన్న విషయంలో ఎవరికీ డౌట్స్ లేకపోవడానికి కారణం అన్నమయ్య, శ్రీరామదాసులే అని చెప్పొచ్చు. శ్రీరామదాసు తర్వాత నాగార్జున కెరీర్ అనుకున్నంత బాగా సాగలేదు. కొన్ని సినిమాలు నిరాశపరిస్తే.. మరికొన్ని సినిమాలు నాగ్ ఎందుకు చేశాడా అనుకున్నారు. తన పరిధిలో తను చేసిన ప్రయత్నాలన్నీ కొత్తగానే ఉన్నా.. ప్రేక్షకులను రుచించలేదు. ఒక్క హిట్ కోసం కింగ్ లాంటి కామెడీ సినిమా.. గగనం, రాజన్న లాంటి పూర్తి స్థాయి ప్రయోగాత్మక చిత్రాలూ చేశాడు.. అలాగే మొదటిసారిగా దేవుడు పాత్రలో శిరిడీ సాయి కూడా చేశాడు. కానీ ఫలితం ఆయన స్థాయిలో రాలేదు. అయితే ఈ సారి చాలా పెద్ద ప్రయోగం మొదలుపెట్టాడు. మనం అంటూ కుటుంబమంతా కలిసి నటించే సినిమా. అలాగని అదేదో తమ కోసం తీస్తున్నది కాదు.. కథనే నమ్మి నాగ్ చేసిన ప్రయత్నం. కానీ అంతలోనే దుర్వార్త. నాగేశ్వరరావుకు క్యాన్సర్. అయినా బాధను దిగమింగుకుని కుటుంబమంతా కలిసి చేసిన మనం.. సూపర్ హిట్ అయింది. కాకపోతే ఆ విజయాన్ని చూడ్డానికి నాగేశ్వరరావు లేరు. కాకపోతే చివరి క్షణం వరకూ నటించాలన్న ఆయన కోరిక మాత్రం తీరింది.. కాదు నాగార్జున తీర్చాడు.

మనం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని చేసిన సోగ్గాడే చిన్ని నాయనా మరో బిగ్గెస్ట్ హిట్. ఈ మూవీతో ఫస్ట్ టైమ్ ఫిఫ్టీక్రోర్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ వయసులో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత ‘ఊపిరి’తో పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైన బిజినెస్ మేన్ గా మరో హిట్ కొట్టాడు. కానీ మరోసారి రాఘవేంద్రరావుతో చేసిన ఓం నమో వెంకటేశాయ ఆకట్టుకోలేదు. ఆ మధ్య చేసిన రాజుగారి గది-2 నిరాశపరిస్తే.. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఆఫీసర్.. దారుణంగా దెబ్బకొట్టింది. నాగార్జున సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లోనూ ఎక్స్ పర్ట్. అయినా స్వీట్ పర్సన్ అంటారు. ఆడంబరాలుండవు.. డౌన్ టూ ఎర్త్. ఒకవేళ ఆయనే గొప్ప ఇంటి కుర్రవాణ్ని.. అక్కినేని అంతటోన్ని అంటూ కాలర్ ఎగరేసుకుని ఉంటే.. ఈ రోజు అంత సాధించి ఉండేవారు కాదు. ప్రస్తుతం నానితో కలిసి మల్టీస్టారర్ గా దేవదాసు చేస్తున్నాడు. అలాగే చాలాయేళ్ల తర్వాత హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో ఓ పాత్ర చేశాడు. మొత్తంగా సెలెక్టివ్ రోల్స్ తో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది.. నాగ్ సినీ ప్రయాణం.