మీరు మంత్రిగా అన్‌ఫిట్.. 730 రోజులు లీవ్ కావాలి: ఉద్యోగి డిమాండ్

బాధ్యతగల మంత్రి పదవిలో ఉంటూ ప్రజల అవసరాలను గుర్తిస్తూ, అధికారుల చేత పనిచేయిస్తూ మంత్రి పదవికి న్యాయం చేయాలి. మరోసారి ఆ మంత్రిగారే మాకు కావాలి అని ప్రజలచేత అనిపించుకోవాలి. కానీ అక్కడ ఆ తీరు కనబడలేదు. అక్కడ పని చేసే సీనియర్ ఉద్యోగికి వర్క్‌లో డెడికేషన్ ఎక్కువ. కింది ఉద్యోగులకు కూడా ఆయన్ను చూస్తే హడల్. ఫైల్ మూసి కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకుందామంటే కుదరదు.

పని రాక్షసుడు వస్తున్నాడంటూ వారు కూడా పని చేయక తప్పని పరిస్థితి. పాకిస్తాన్‌ రైల్వే శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న మహ్మద్ హనీఫ్ గుల్‌కు పని పట్ల నిబద్దత ఉన్న వ్యక్తిగా పేరుంది. తాను పనిచేస్తూ క్రింది స్థాయి ఉద్యోగులు కూడా పనిచేసేలా ప్రోత్సహిస్తారు. అవసరమైతే అజమాయిషీ చేసి మరి ఆ పని జరిగేలా చూస్తారు. ఇటీవల రైల్వే శాఖకు కొత్త మంత్రిగా షేక్ రషీద్ అహ్మద్ బాధ్యతలు తీసుకున్నారు. మంత్రిగారి పని తీరు హనీఫ్‌కు నచ్చలేదు. సంవత్సర కాలంగా ఆయన్ను గమనిస్తూ వస్తున్నాడు. ఇక నావల్ల కాదు. ఆయన మంత్రిగా ఉన్నంత కాలం నేనిక్కడ పని చేయలేను అంటూ లాంగ్ లీవ్‌ ఏకంగా 730 రోజులు కావాలంటూ లెటర్ రాసేసాడు.

అందులో అహ్మద్ మంత్రిగా ఏమాత్రం పనికి రారు. రైల్వే మంత్రికి కావలసిన నైపుణ్యాలు లేవు. వృత్తి పట్ల గౌరవం, నిబద్దత లేదు.. పాకిస్థాన్ పౌరుల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా.. ఆయన ఆధ్వర్యంలో నేనసలు పనిచేయలేను. అందుకే నేను లీవ్ అడుగుతున్నా. అంతకు మించి ఆయనను మంత్రి పదవినుంచి తొలగించే అధికారం నాకు లేదు కదా అంటూ లీవ్ లెటర్‌‌లో పేర్కొన్నారు హనీఫ్. పాకిస్తాన్ మీడియా ఈ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. పనిచేయని మంత్రిపై నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -