చరిత్రకు ఒక్క అడుగు దూరంలో సింధు

తెలుగు తేజం పీవీ సింధు ఆసియాడ్‌లో చారిత్రక స్వర్ణానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రవేశించింది. టైటిల్‌ కోసం ఇవాళ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తైజు యింగ్‌ను ఢీకొనేందుకు రెడీ అయింది.

వరల్డ్‌ రెండో ర్యాంకర్‌ యమగుచితో జరిగిన ఉత్కంఠ సెమీఫైనల్లో 21-17, 15-21, 21-10 స్కోరుతో సింధు జయకేతనం ఎగురవేసింది. ఈ ఆసియాడ్‌ క్రీడల్లో యమగుచిపై సింధుకు ఇది రెండో విజయం. టీమ్‌ చాంపియన్‌షిప్‌లోనూ యమగుచిని చిత్తు చేసింది.

యమగుచితో 65 నిమిషాల సెమీఫైనల్లో తొలుత తడబడిన సింధు.. ఆ తర్వాత కోలుకొని గేమ్‌పై పట్టు సాధించింది. యమగుచి దూకుడుగా ఆడినా.. సింధు తన హైట్‌ను ప్లస్‌పాయింట్‌గా మార్చుకుని పదునైన షాట్లతో ఆమెను సమర్థంగా అడ్డుకుంది. ర్యాలీలతో ప్రత్యర్థిపై ఆధిక్యం కనబరిచిన సింధు.. తొలి బ్రేక్‌కు 11-8 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో 21-17తో మొదటి గేమ్‌ సింధు వశమైంది. రెండో గేమ్‌లోనూ సింధు ఆధిపత్యం ప్రదర్శించినా.. అనవసర పొరపాట్లతో ఆధిక్యాన్ని చేజార్చుకుంది. దాంతో యమగుచి రెండో గేమ్‌ను గెలుపొందింది. కానీ మూడో గేమ్‌లో మళ్లీ పుంజుకొన్న సింధు 50 షాట్లతో సుదీర్ఘంగా సాగిన ర్యాలీని నెగ్గి ఆధిక్యంలో నిలిచింది. అదే ఊపులో ఓ అద్భుత స్మాష్‌తో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇవాళ జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో స్వర్ణ పతకం కోసం ప్రపంచ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌తో సింధు తలపడుతుంది. గత ఐదుసార్లలో తైవాన్‌ షట్లర్‌ తైజును సింధు ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది.