
ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. 4 × 400 మిక్స్డ్ రిలేలో భారత ఆటగాళ్లు.. రెండో స్థానంలో నిలవడంతో.. పట్టికలో భారత పతకాల సంఖ్య 50కి చేరింది. రిలేలో బహ్రెయిన్ స్వర్ణం సాధించింది. అటు ఆర్చరీలో పసిడి పతకాలను ఆశించిన భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత కాంపౌండ్ పురుషుల, మహిళల జట్లు ఫైనల్లో ఓడిపోయి రజతాలతో సరిపెట్టుకున్నాయి. హోరాహోరీగా సాగిన పురుషుల ఫైనల్లో రెండు జట్లు 229 – 229తో నిలవడంతో పోరు షూటాఫ్‌కు దారితీసింది. కానీ షూటాఫ్‌లో కూడా రెండు జట్లు 29 – 29తో నిలిచాయి. ఐతే నిబంధనల ప్రకారం 10 పాయింట్ల రౌండ్‌కు దగ్గరగా బాణం వేసిన కొరియా విజేతగా నిలిచింది. అటు మహిళల ఫైనల్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, మధుమిత, ముస్కర్ కిరార్‌లతో కూడిన భారత జట్టు 228-231తో ఓటమి పాలైంది.
మేజర్ ఈవెంట్లో ఆఖరి అడ్డంకిని అధిగమించడంలో పీవీ సింధు విఫలమైంది. మరోసారి రజతంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 13 – 21, 16 – 21తో ప్రపంచ నంబర్‌వన్ తైజు యింగ్ చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో ఓడినప్పటికీ సింధు గెలిచిన రజతం చరిత్రాత్మకమే. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇదే తొలి రజత పతకం.