రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూత.. ప్రమాదం ఎలా జరిగిందంటే!

harishna-dead

నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. ఇవాళ ఉదయం నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తతో యావత్ తెలుగు ప్రజల్ని షాక్‌కి గురి చేసింది.


ప్రమాద విషయం తెలియగానే హుటాహుటిన హరికృష్ణ కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ సహా కుటుంబ సభ్యులంతా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి వెళ్లారు. ఐతే.. తలకు బలమైన గాయం అయిన కారణంగా.. ఆయన చికిత్సకు స్పందించకపోవడంతో పరిస్థితి క్షణక్షణానికీ దిగజారింది. చివరికి ఉదయం ఏడునలభైకి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.

ఉదయం ఆరుగంటల పదిహేను నిమిషాలకు అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఆయన నెల్లూరు వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర కారు యాక్సిడెంట్‌కి గురయ్యింది. అతివేగంతో కారు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఫార్చ్యూనర్ కారు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. హరికృష్ణ కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టి తర్వాత డివైడర్‌ను దాటి పల్టీ కొట్టింది. యాక్సిడెంట్ అయినప్పుడు కారులో హరికృష్ణతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వారు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాదం జరిగిన తీరు చూస్తే కారు పల్టీ కొట్టాక హరికృష్ణ కారులోంచి బయటకు పడిపోయారు. తలకు బలమైన గాయం అవడంతో స్పాట్‌లోనే విపరీతంగా రక్తస్రావమైంది. 108 వాహనాన్నిరప్పించి ఆయన్ను కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే పరిస్థితి విషమంగా మారిపోయింది. ఆయన సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, ఆయన సీటు బెల్ట్ ధరించి ఉంటే.. ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని అనిపిస్తోంది. హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఆ కారణంగానే కారులో మరో ఇద్దరు ఉన్నా ఆయనే స్టీరింగ్ పట్టారు. తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లినా వెలుగొచ్చే వరకూ బాగానే ఉంది. ఉదయం 6 గంటల 15 నిమిషాలకు ప్రమాదం జరిగింది. కాసేపటికే హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారు.

harikrishna

ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరావతి నుంచి కాసేపట్లో చంద్రబాబు బయలుదేరి ఆస్పత్రి వద్దకు రానున్నారు. అటు, నందమూరి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడంతా విషాద వాతావరణం నెలకొంది.