దేవుడా.. గాళ్‌ఫ్రెండ్‌తో రాఖీనా అంటూ బిల్డింగ్ పైనుంచి దూకేసరికి..

రాఖీ కట్టాలంటే రక్తం పంచుకు పుట్టిన అన్నే కానక్కరలేదు. అన్నా అంటూ పిలిచే అందరికీ రాఖీ కట్టేయొచ్చు. కొందరు అకతాయి అబ్బాయిలనుంచి తప్పించుకోవడనికి రాఖీ అనే ఆయుధాన్ని ఉపయోగిస్తుంటారు తెలివైన అమ్మాయిలు. తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆ విషయం కాస్త ఫన్నీగానే ఉంటుంది. అయితే అదే మేటర్ ఇక్కడ సీరియస్ అయింది.

స్కూల్లో చదివే ఓ అబ్బాయి అదే స్కూల్లో చదివే అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకుని అతడికి రాఖీ కట్టాలనుకుంది. ఆమె రాఖీతో అబ్బాయి కళ్లముందు ప్రత్యక్షమయ్యేసరికి తప్పించుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. ఈ ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆసుపత్రి పాలయ్యాడు.

త్రిపుర రాజధాని అగర్తలా పాఠశాలలో చదువుతున్న దిలీప్ కుమార్ షా పన్నెండోతరగతి చదువుతున్నాడు. అదే స్కూలుకు చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. కానీ ఆ అమ్మాయికి ప్రేమా గీమా అంటూ వెంటపడడం నచ్చలేదు. ఇదే విషయాన్ని టీచర్లతో చెప్పింది. దిలీప్‌కి బుద్దిచెప్పే అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు రాఖీ పండుగ ఓ మంచి అవకాశంగా కనిపించింది. దిలీప్‌కి రాఖీ కట్టమంటూ ఆ అమ్మాయిని ప్రోత్సహించారు.

సరేనంటూ రాఖీ కట్టడానికి వెళ్లేసరికి దిలీప్ పరుగు తీశాడు. పాఠశాల రెండో అంతస్తుపైకి వెళ్లి కిందకు దూకేశాడు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ తిన్న టీచర్లు తీవ్రగాయాలపాలైన దిలీప్‌ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందంటూ కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -