కుటుంబం కోసం అన్నదమ్ములతోనూ విభేదించిన హరికృష్ణ

నందమూరి హరికృష్ణ మరణం రాజకీయ, సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదం ఆయన్ని బలి తీసుకోవడం ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. నందమూరి తారకరామరావు ప్రియ తనయుడుగా మొదలైన ఆయన ప్రస్థానం ఎంతో విశిష్టమైనది. తండ్రిని విజేతగా నిలిపిన తనయుడుగా.. తనయులను ప్రయోజకులను చేసిన తండ్రిగా హరికృష్ణ తన రెండు పాత్రలకూ ఆదర్శవంతంగా పోషించాడు. కానీ ఈ హఠాన్మరణం ఆయన కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది.

నందమూరి తారకరామరావు వారసుడు అనే మాటకు మించిన గుర్తింపు ఇంకేం అక్కర్లేదు. ఆ గుర్తింపుతోనే అంచలంచెలుగా ఎదిగినా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో హరికృష్ణది విశిష్ట శైలి. రెబలిజం, డైనమిజం కలబోసిన ఆయన వ్యక్తిత్వం ఎందరికో నచ్చింది. ఎందరినో ఆప్తులుగా మార్చింది. ఒకప్పుడు తండ్రి కోసం ఏం చేయడానికైనా వెనుకాడని వ్యక్తిత్వంతో ఆకట్టుకున్న హరికృష్ణ తర్వాత తనయుల కోసం ఎంతో చేసిన తండ్రిగానూ అంతే బాధ్యతగా వ్యవహరించాడు. కుటుంబానికి కష్టసమయాల్లో అండగా నిలబడి.. ఎన్ని విమర్శలు వచ్చినా ఎవర్నీ లెక్క చేయకుండా కుటుంబం కోసం చివరికి అన్నదమ్ములతోనూ విభేదించిన తండ్రి ఆయన..

హరికృష్ణను నటుడుగా చూడాలనుకున్నారు రామారావుగారు. అందుకే చిన్నతనం నుంచే తన వెంట తిప్పుకుంటూ కొన్ని బాలనటుడుగా పరిచయం చేశాడు. అలాగే అటు బాలయ్యను సైతం తన నట వారసుడిగా చూడాలనుకున్న ఆయన ఈ ఇద్దరితో కలిపి కొన్ని సినిమాలు చేశారు. హరికృష్ణ, బాలయ్య కలిసి నటించిన తల్లా పెళ్లామా, తాతమ్మ కల, రామ్ రహీమ్ సినిమాలు నేటికీ అలరిస్తుంటాయి. ఈ క్రమంలో హరికృష్ణ కంటే తన నట వారసుడిగా బాలయ్యే ఎక్కువగా రాణిస్తారని పెద్దాయన ముందే అంచనా వేశారు. కానీ తన ప్రతి అడుగులోనూ హరి ఉండేలా చూసుకున్నారు. అందుకే ఈ ఇద్దరి మధ్య ఇతర కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అనుబంధం ఉందని చెబుతారు.

అన్నగారు పార్టీ స్థాపించిన తర్వాత అన్నీ తానే అయి చూసుకున్నారు. ఆంధ్రదేశ పర్యటన కోసం స్వయంగా చైతన్య రథం దగ్గరుండి తయారు చేయించారు. మరెవరైనా అయితే తండ్రిగారిని జాగ్రత్తగా చూస్తారో లేదో అనే తనే స్వయంగా ఆ చైతన్యరథానికి సారథి అయ్యారు. లక్షలాది జనం మధ్య వేల కిలోమీటర్లు బండి నడపడం అంటే అంత సులువైన పనికాదు. తండ్రి కోసం ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేసి.. ఆ రథం నుంచి అన్నగారిని అసెంబ్లీకి పంపించారు.

ఇక అనుకోకుండా మళ్లీ వెండితెర నటుడయ్యాడు. శ్రీరాములయ్య సినిమాలో నక్సలైట్ నాయకుడు వెంపటాపు సత్యంగా అద్భుతంగా ఒదిగిపోయాడు. ఆ తర్వాత ఓ పది సినిమాల వరకూ నటించారు. వీటిలో చాలా వరకూ పవర్ ఫుల్ పాత్రలే. కొన్నాళ్ల తర్వాత మరోసారి సినిమా నుంచి నిష్క్రమించారు. అటుపై మధ్యలో కొంత అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని తనయుల విజయాలను ఆస్వాదిస్తున్నారు. కానీ ఇంతలోనే అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని కుదిపేసింది.