ప్రమాదానికి ముందు అక్కడ ఆగి స్నేహితులను పలకరించి..

రోడ్డు ప్రమాదానికి గురై మృత్యుఒడికి చేరుకున్న నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున నెల్లూరుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో చింతల్ కుంటలో కొద్ది సేపు ఆగారు. ఈ ప్రాంతంలో ఆయనకు స్నేహితులు ఎక్కువగా ఉన్నారు. చిన్ననాటి స్నేహితుడు నాగేశ్వరరావుకు చెందిన పశువుల పాకలో ఎక్కువ సమయాన్ని గడుపుతుండేవారు. తమది 40 ఏళ్ల స్నేహమని నాగేశ్వరరావు పేర్కొన్నారు.

వారానికి నాలుగైదు సార్లు తప్పని సరిగా వస్తుండేవారని అయితే పెద్దకుమారుడు జానకి రామ్ మరణం తరవాత రావడం తగ్గించారని అక్కడివారు గుర్తుచేసుకుంటున్నారు. ప్రశాంత్ నగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు వెంకట్రావును కూడా కారులో ఎక్కించుకుని వెళ్లాలనుకున్నారు. అక్కడే ఉన్న దుర్గా విలాస్ హోటల్ ముందు కొద్ది సేపు ఆగి అక్కడి వారితో ముచ్చటించారు. పశువుల సంత వ్యాపారులు సత్తిబాబు, సాంబశివరావులు హరికృష్ణ కారువద్దకు వచ్చి అతడితో వ్యాపార వ్యహారాలు మాట్లాడి వెళ్లారు. మా మంచీ చెడు కనుక్కునే మంచి వ్యక్తి ఇలా మరణించడం కలచివేస్తుందంటూ
కన్నీరుమున్నీరవుతున్నారు.