నేనేం మా ఆయనకు పోటీ కాదు: సమంత

అక్కనేని వారింట అందరూ స్టార్లే. తాత, తండ్రి, మనవడు, ఆఖరికి కోడలు కూడా. అభిమానుల్లో వారికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చైతూతో జీవితాన్ని పంచుకున్నా తెరపై జీవించేస్తుంది సమంత. పెళ్లయిన తరువాత కూడా చక్కని పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో తన పట్ల ఉన్న క్రేజ్‌ని పదిలపరచుకుంది.

భార్యా భర్తలు ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. తాజాగా సమంత నటించిన యూటర్న్ సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ చేయాలనుకుంటుంది చిత్ర యూనిట్. అయితే చైతూ నటించిన శైలజా రెడ్డి అల్లుడు ఆగస్టు 31న రావలసి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా స్పష్టం కాలేదు. చైతూ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 13నే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్నవిషయాన్ని ఆలోచిస్తున్నారు యూనిట్ సభ్యులు.

ఒకవేళ ఒకేసారి రిలీజ్ అయినా ఒకదానికొకటి పోటీ కావని సమంత భావిస్తోంది. ఓ అభిమాని ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇంతకు ముందు ‘చైసామ్’ అనే వాళ్లం. ఇప్పుడు ‘చై వర్సెస్ సామ్’ అయిపోయింది అని ట్వీట్ చేశాడు. ట్వీట్‌కు స్పందించిన సామ్ ‘చై వర్సెస్ సామ్’ కాదు ‘చై విత్ సామ్’ అని స్పష్టం చేసింది.