పది మంది సెక్స్‌వర్కర్లను రాత్రంతా …

sex-workers

వాళ్లు చేస్తున్నది పడుపు వృత్తే కావొచ్చు. ఆ దారి ఎంచుకున్నది కడుపు నింపుకోవడానికే తప్ప.. ఇతరుల కడుపు కొట్టే మనుషులైతే కాదు. అలాంటి సెక్స్‌ వర్కర్ల పట్ల ఖమ్మం ఖాకీలు.. కర్కషత్వాన్ని చూపించారు. నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ.. రాత్రంతా స్టేషన్‌లో నరకం చూపించారు. ఇదీ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే.. అని కొత్త నిర్వచనం చెప్పారు.

మంగళవారం రాత్రి పది మంది సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు ఖమ్మం పోలీసులు. వాళ్లను రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఒక్క ఆడ పోలీసు కూడా లేదు. సెక్స్‌ వర్కర్లే కదా అన్న చులకన భావంతో.. మగపోలీసులు విచక్షణ మరిచిపోయారు. ముట్టకూడని చోట ముట్టుకుంటూ, వెయ్యకూడని చోట చేతులు వేస్తూ.. సెక్స్‌వర్కర్లను నానా ఇబ్బందులకు గురిచేశారు. ప్రతిఘటించినందుకు బూతులు తిట్టారు, కొట్టారు. ఆ తర్వాత వాళ్ల దగ్గరున్న సెల్‌ఫోన్లు, డబ్బులు, పవర్‌ బ్యాంకులు, బట్టలు లాక్కుని… బయటకు పంపేశారు. తిరిగి ఇవ్వమని అడిగితే.. ససేమిరా అన్నారు. దీంతో ఏంచేయాలో తెలియక సెక్స్‌వర్కర్లు టీవీ ఫైవ్‌ని ఆశ్రయించారు.. తమ గోడు వెళ్లబోసుకున్నారు.

పొట్ట కూటి కోసం తామంతా ఈ వృతిలో కొనసాగుతున్నామని.. పోలీసులు ఇలా వేధించడం భావ్యం కాదని సెక్స్‌ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారా కాచేవాళ్లకు ఇచ్చినట్టు తమకు రుణాలిస్తే… ఈ వృత్తిని మానేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. పోలీసులు తమతో కామవాంఛ తీర్చుకోవడంతో పాటు, వస్తువులను కూడా లాక్కోవడం దారుణమంటున్నారు. తాము మారాలని కోరుకునే వాళ్లు.. ఇలా ప్రవర్తించడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.