ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఆ పేర్లు ప్రత్యేకం.. ఎందుకంటే..

ntr family names history

‘నందమూరి తారకరామారావు’ ఈ పేరు వినగానే ఒళ్ళు పులకించిపోతుంది. నటుడిగా, ముఖ్యమంత్రిగా, ఆంధ్రుల అన్నగా.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అభిమానులకు ఆయన మాటంటే వేదం.. నటనంటే ప్రాణం.. ఆ అభిమానమే ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసింది. ముఖ్యమంత్రిగా ప్రజలకు కలకాలం గుర్తుండిపోయే పాలన అందించారు ఎన్టీఆర్. ఎందరు పాలకులు వచ్చినా ఆయనకు సాటి రారు. ప్రజలను తన సొంత కుటుంబసభ్యులుగా చూసే ఎన్టీఆర్ ఎన్నో ప్రజారంజక పథకాలతో పేదవారి హృదయాల్లో గూడు కట్టుకున్నారు.

ఎన్టీఆర్ కు ప్రజలంటే ఎంతిష్టమో కుటుంబం అన్నా అంతే ఇష్టం. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబసభ్యుల్ని అస్సలు మిస్సయ్యేవారు కాదు. ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం. ఇద్దరు దేవుళ్ల పేర్లు వచ్చేటట్టుగా కుమారులకు, కుమార్తెలకు నామకరణం చేశారు. వారు జయశంకర్ కృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, సాయి కృష్ణ, జయకృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ. ఇక నలుగురు కూతుళ్లు పురందేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి.

ఇక ఇదే పద్దతిని ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా పాటించారు. కాకపోతే హరికృష్ణ తనకిష్టమైన దేవుడిగా తండ్రినే ఆరాధించాడు. అందుకే తనకు పుట్టిన నలుగురు సంతానంలోని ముగ్గురు కుమారులకు తండ్రి నందమూరి తారకరామారావులోని ‘రామ’ అన్న పేరును కలిసివచ్చెటట్ట్టుగా పెట్టారు. వారిలో పెద్ద కుమారుడు జానకిరామ్, తరువాత కళ్యాణ్ రామ్, తారకరామారావు. తారకరామారావు(జూనియర్ ఎన్టీఆర్) పేరును తండ్రి ఎన్టీఆర్ పెట్టారు. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అచ్చం తాత ఎన్టీఆర్ అంశతో పుట్టడమే అని జూనియర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక హరికృష్ణ ఒక్కగానొక్క కూతురు పేరు సుహాసిని.