బ్యాంక్‌లో గోల్‌మాల్.. ఖాతాలో జమచేసిన రూ.కోటి మాయం

golmal-in-bank-1

బ్యాంకు ఖాతాలో జమచేసిన డబ్బు మాయమైంది. పైగా రుణం తీసుకున్నారంటూ బ్యాంకు అధికారుల దబాయింపు. బ్యాంకు అధికారులే తమ డబ్బును గోల్‌మాల్ చేశారిన డ్వాక్రా సంఘాల బాధితులు ఆందోళనకు దిగారు. దాదాపు కోటి రూపాయలు ఏమయ్యాయని బాధితులు అధికారులను నిలదీశారు.

పశ్చిమగోదావరి జిల్లా బయ్యనగూడెం ఆంధ్రాబ్యాంక్ దగ్గర డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళనకు దిగారు. తమ డబ్బు ఏమందో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు? తమకు తెలియకుండా అప్పు ఎవరికి ఇచ్చారంటూ ప్రశ్నించారు.

డ్వాక్రా సంఘాల మహిళల ఆ్రగహానికి కారణం బయ్యనగూడెం బ్యాంకు అధికారుల తీరే. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 20 డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు పొదుపు చేస్తున్నారు. ఆ డబ్బును వెలుగు ప్రాజెక్టు సీఏగా పనిచేస్తున్న నాగలక్ష్మి తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది. ఒక్కో గ్రూపు మూడు లక్షల వరకు జమ చేసింది. ఇంతలో బ్యాంకు అధికారులు ఒక్కో గ్రూపు ఆరు లక్షల రుణం తీసుకుందని, బాకీ చెల్లించాలనడంతో ఆందోళన మొదలైంది. తమ ఖాతాలు ఎలా ఖాళీ అయ్యాయో వాళ్లకు అర్థం కాలేదు. అప్పు తీసుకోకుండా బ్యాంకు అధికారులు రుణం తీసుకున్నారనడంతో షాకయ్యారు. అయితే ఇదంతా సీఏ నాగలక్ష్మి, బ్యాంకు అధికారులు కుమ్మక్కై డబ్బు గోల్‌మాల్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

తమ దగ్గర డబ్బు తీసుకెళ్తున్న నాగలక్ష్మి… దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తోందని గ్రూపు సభ్యులు భావించారు. అయితే తాము నెలనెలా డబ్బు చెల్లించిన తర్వాత నాగలక్ష్మి రసీదులు ఇవ్వలేదని బాధితులు అంటున్నారు. నాగలక్ష్మి, బ్యాంకు అధికారులపై చర్యతీసుకోవాలని బాధితులు కొయ్యలగూడెం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు ఆగ్రహించారు. తమ ఖాతాల్లో జమచేసిన దాదాపు కోటి రూపాయలు తిరిగి ఇప్పించాలని, నాగలక్ష్మి, బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. మరోవైపు బ్యాంకు అధికారులు మాత్రం అదంతా బ్యాంకు బయట జరిగిన వ్యవహారంగా సమర్ధించుకుంటున్నారు. ఇందులో తమ తప్పేమీ లేదంటున్నారు. మరి గ్రూపు సభ్యులు బ్యాంకుకు రాకుండా రుణం ఎలా ఇచ్చారంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు. అటు సీఏ నాగలక్ష్మి తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని డ్వాక్రా సంఘాల ఏపీఎం ప్రభావతి తెలిపారు. అవకతవకలు నిజమని తేలితే డబ్బు రికవరీ చేసి డ్వాక్రా సంఘాలకు తిరిగి ఇస్తామంటున్నారు. కానీ బాధితులు మాత్రం ఈ గోల్‌మాల్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.