మళ్లీ 'బేర్' మన్న స్టాక్ మార్కెట్లు

మళ్లీ బేర్ మన్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మళ్లీ బేర్ మన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల మార్కెట్లతో దేశీయ సూచీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, సెన్సెక్స్‌లో మరోసారి బ్లాక్ మండే నమోదైంది. సెన్సెక్స్‌ ఏకంగా 2 వేల 700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 770 పాయింట్లు కోల్పోయింది. రెండు సూచీలు కూడా దాదాపు 6 శాతం పతనమయ్యాయి. ప్రారంభం నుంచే మార్కెట్ సెంటిమెంట్‌ దెబ్బతింది. ఉదయం సెషన్ ప్రారంభం కాగానే బెంచ్‌ మార్క్ సూచీలు తీవ్రంగా దిగజారాయి. పెట్టుబడిదారులు అమ్మకాలకే మొగ్గుచూపారు. కొనుగోళ్లు తగ్గడంతో బుల్ జోరు పూర్తిగా పడిపోయింది. బేర్‌ మార్కెట్ పట్టు బిగి యడంతో మదుపరులు విలవిలలాడిపోయారు. ఈ నెగెటివ్ ఎఫెక్ట్ అంతకంతకూ పెరగడంతో మార్కెట్లు కుదేలయ్యాయి.

స్టాక్ మార్కెట్ల పతనానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేటును సున్నా శాతానికి పరిమితం చేసింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ దిగజారిందనే వార్తలతో మదుపరులు అమ్మకాలకు తెగబడ్డారు. ఇదే సయయంలో కరోనా వైరస్‌ 150 దేశాలకు విస్తరించడం పెట్టుబడిదారుల్లో భయాందోళన లను పెంచింది. ఈ రెండింటీ దెబ్బతోనే అతలాకుతలమవుతున్న సమయంలో చమురు ధరలు మరో దెబ్బ కొట్టాయి. క్రూడాయిల్ రేట్లు పెరగకపోవడంతో షేర్ల ధరలు భారీగా తగ్గాయి.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సున్నా శాతానికి చేర్చడం చాలా అరుదు. 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా తర్వాత అమెరికాలో మాంద్యం ఏర్పడింది. ఆ సమయంలో వడ్డీ రేట్లను సున్నా శాతాని కి మార్చారు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్లీ వడ్డీ రేట్లను జీరో పర్సంటేజ్‌కు తీసుకువచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా 700 బిలియన్ డాలర్ల ట్రెజరీ నిధులు వెచ్చిస్తామని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story