రాఘవేంద్రరావు కామెంట్.. గీతగోవిందం నా సినిమా కాపీ..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం గీత గోవిందుల గురించే మాట్లాడుకుంటోంది. ఆ సినిమా అంతగా కనెక్ట్ అయింది అందరికీ. అందుకే 100 కోట్ల గ్రాస్‌ని చేరుకుంది. విజయ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అందరూ. ఎలాంటి కథనైనా అందంగా మలిచే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని బాగా ఆకర్షించాడు గోవిందుడు.

ఓ అవార్డు ఫంక్షన్‌కి హాజరైన ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని.. చూస్తున్నంతసేపు తాను తీసిన పెళ్లిసందడి చిత్రం గుర్తుకు వచ్చిందని అన్నారు. ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా చిత్రీకరించారని దర్శకుడు పరశురామ్‌ని ప్రశంసించారు. నా సినిమానే కాపీ కొట్టారేమో అని అనిపించేలా తీసాడన్నారు. చిన్న సినిమా ఇంత భారీ విజయాన్ని తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. 20 ఏళ్ల క్రితం ప్రభంజనాన్ని సృష్టించిన పెళ్లి సందడి మూడు నంది అవార్డులు తీసుకుంది. తాజాగా గీతగోవిందం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లో సైతం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.