తెలంగాణలో సీనియ‌ర్ నేత‌ల‌కు త‌ల‌నొప్పులు తెచ్చేలా వార‌సుల పోరు

nizamabad rural and urban political situation in congress party

ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఎంపీ జితేందర్‌ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఈ సారి టికెట్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వారసుడు అరుణ్ ఇప్పటికే యువసేన పేరుతో జిల్లా రాజకీయాల్లో యాక్టీవ్‌ అయ్యారు. తనకు కొడంగల్ ఇచ్చినా గెలుచుకొస్తానంటున్నారు. అటు మాజీ ఎంపీ మందా జగ‌న్నాథం కొడుకు మందా శ్రీ‌నాథ్‌ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ టికెట్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. నాగం జ‌నార్దన్ రెడ్డి కొడుకు నాగం శ‌శిధ‌ర్ కూడా గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసినా.. ఓటమి తప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి మళ్లీ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే వీరంతా ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోవడం అనుమానమే.. పోటీ భారీగా ఉండడం.. పైగా తండ్రులు కూడా ఈసారి ఎన్నికల్లో తలపడేందుకు సిద్దమవడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకూ వేచిచూడక తప్పదంటున్నారు.

GHMC ప‌రిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీమంత్రుల వారసులు తెరమీదకు వస్తున్నారు. మాజీ హోంమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో చేవెళ్ళ ఎంపిగా పోటీ చేసారు. ఈ సారి కూడా ఆయ‌న ఎన్నిక‌ల బరిలో దిగడం ఖాయం. రాజేంద్ర న‌గ‌ర్ నియోజకవ‌ర్గం నుండి పోటీ చేయాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు. అయితే స‌బితా ఇంద్రారెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో త‌న వారుసుడి కోసం పోటీ నుండి ఉప‌సంహ‌రించుకోగా ఈ సారి త‌ను కూడా చేవేళ్ల ఎంపీ లేదా‌ మ‌హేశ్వరం నుంచి పోటీకి సిద్దమ‌వుతున్నారు. ఇక టీడీపీ ప్రభుత్వ హాయంలో హోంమంత్రిగా ప‌నిచేసిన దేవేంద‌ర్ గౌడ్ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. త‌న వార‌సుడు వీరేంధ‌ర్ గౌడ్ ను చేవెళ్ళ నుండి రంగంలోకి దింపినా ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో ఉప్పల్ నుండే పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్నారు. దేవేంద‌ర్ గౌడ్ కూడా మ‌ల్కాజ్ గిరి నుండి ఎంపీకి పోటీచేసే అవ‌కాశం ఉంది. ఇక మంత్రి త‌ల‌సాని కుమారుడు సాయికిర‌ణ్ సైతం తండ్రి వాస‌ర‌త్యం అందుకునేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఈ సారి త‌ల‌సానే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుండ‌టంతో మ‌రింత కాలం ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ప‌ద్మారావు కుమారుడు రామేశ్వర్‌ గౌడ్‌ కూడా నియోజక వ‌ర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ అంజ‌న్ కుమార్ యాద‌వ్ త‌న‌యుడు అనీల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ ప‌రిధిలో ఏదో ఓ నియోజక వ‌ర్గం నుండి పోటీచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ గోషామ‌హల్ నియోజక వ‌ర్గం నుండి పోటీకి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పేద‌లకు అండ‌గా ఉంటాడ‌న్న పేరున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పీ జ‌నార్దన్ రెడ్డి అకాల మ‌ర‌ణం చెంద‌డంతో అనుకోకుండా రాజ‌కీయ ప్రవేశం చేసిన ఆయ‌న త‌న‌యుడు విష్ణు ఈ సారీ మ‌రోమారు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్దమ‌వుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న అక్క విజ‌య సైతం గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు.. ఆ త‌రువాత జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి కార్పోరేట‌ర్ గా పోటీచేసి గెలుపొందారు. విజ‌య సైతం ఈ సాధార‌ణ ఎన్నిక‌ల్లో పోటీచేసి త‌న స‌త్తా నిరుపించుకోవాల‌ని చూస్తున్నారు.

ఇక హోంమంత్రి నాయ‌ని న‌ర్సింహారెడ్డికి రాజ‌కీయ వారుసుడిగా అల్లుడు శ్రీ‌నివాస్ రెడ్డికి పేరుంది. ప్రస్తుతం ఆయ‌న కార్పోరేట‌ర్ గా కొన‌సాగుతున్నారు. నాయ‌ని న‌ర్సింహారెడ్డి గ‌తంలో ముషిరాబాద్ నియోజిక వ‌ర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు. అయితే ఈ సారి ఆయ‌న పోటీచేస్తారా లేదా అనే దానిపైనే శ్రీ‌నివాస్ రెడ్డి భ‌విత‌వ్యం అధార‌ప‌డి ఉంది. ఇక ప‌రిగి నియోజక వ‌ర్గం సీనియ‌ర్ నేత హ‌రీష్వర్ రెడ్డి వార‌సుడు సైతం పోటీకి సై అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌రువాత హ‌రీశ్వర్ రెడ్డి అనారోగ్యం కారణంగా వార‌సుడు పోటీ దాదాపు ఖాయమంటున్నారు.

మొత్తానికి తెలంగాణలో వార‌సుల పోరు సీనియ‌ర్ నేత‌ల‌కు త‌ల‌నొప్పులు తెచ్చేలా క‌నిపిస్తున్నాయి. కొంత‌మంది వార‌సులు త‌మ తండ్రుల‌మీద ఉన్న గౌర‌వంతో త‌ప్పుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నా.. మ‌రికొంత మంది వార‌సులు సైతం క‌చ్చితంగా తాను పోటీచేసి తీరుతామ‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇస్తే అదే పార్టీ నుండి లేక పోతే త‌మ‌కు టికెట్లు ఇచ్చే ఏ పార్టీలోనైనా చేరేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌న్న సంకేతాలిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ లో వార‌సత్వ రాజ‌కీయాల్లో ఎలాంటి మార్పుల‌కు దారితీస్తాయో చూడాలి.