రూపాయి విలువ ఎందుకింతగా పడిపోతోందంటే..?

డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ మరోసారి సరికొత్త కనిష్ట రికార్డును సృష్టించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 22 పైసలు(0.3 శాతం) నీరసించింది. 70.81ను తాకింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా.. బుధవారం సైతం ఇంట్రాడేలో 54 పైసలు(0.8 శాతం) పతనమైంది. 70.65ను తాకింది. తద్వారా డాలరుతో మారకంలో రూపాయి విలువ పాతాళానికి చేరింది. ఇంతక్రితం ఈ నెల 13న మాత్రమే రూపాయి విలువ ఇంతకంటే అధికంగా 110 పైసలు(1.6 శాతం) కుప్పకూలింది. కాగా.. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి రూపాయి మారకపు విలువ 49 పైసలు(0.7 శాతం) కోల్పోయి 70.59 వద్ద ముగిసింది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి క్షీణించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ డాలరుతో మారకంలో రూపాయి 9.5 శాతం పతనంకావడం గమనార్హం!

కారణాలేంటంటే?
ఇటీవల తిరిగి జోరందుకున్న ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి. మరోవైపు వాణిజ్య వివాద పరిష్కారాల దిశలో మెక్సికో, కెనడాలతో అమెరికా ప్రభుత్వం సరికొత్త డీల్స్‌ను కుదుర్చుకుంటోంది. 1994లో కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)ను వ్యతిరేకిస్తున్న ట్రంప్ ప్రభుత్వం అప్పటి ఒప్పందాలను పూర్తిస్థాయిలో పునఃసమీక్షిస్తోంది. మరోపక్క ఆ  దేశ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. వృద్ధి బాటలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడంతోపాటు ద్రవ్యోల్బణ నియంత్రణకు క్రమంతప్పని వడ్డీ రేట్ల పెంపు సహకరించగలదని గత వారం ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో డాలరు బలపడుతుంటే.. ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. దేశీయంగానూ జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు బ్యారల్‌ తాజాగా 76 డాలర్ల సమీపానికి చేరగా.. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 68.6 డాలర్ల వద్ద కదులుతోంది.