మూడు ముళ్ల బంధం ముణ్ణాళ్ల ముచ్చట.. వరకట్న దాహానికి మరో ఆడపడుచు బలి

మూడు ముళ్ల బంధం ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. అదనపు కట్నం ఆరళ్లు భరించలేక మూడు నెలల వివాహ బంధానికి ముగింపు పలికింది. ఉరి వేసుకుని అరుణ మరణించింది. కట్న దాహానికి మరో ఆడపడుచు జీవితం బుగ్గిపాలైంది. సంస్కారం లేని చదువులు ఆడపిల్లల జీవితాల్ని శాసిస్తున్నాయి. వరకట్న చావులు ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పుకుంటున్న సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం విద్యుత్ నగర్‌కు చెందిన రావూరి వెంకటేశ్వరరావు కుమార్తె అరుణాదేవిని యానాంకు చెందిన కామిశెట్టి వెంకట పెరుమాళ్లుకు ఇచ్చి మే5న వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లి సమయంలో 15 కాసుల బంగారంతో పాటు కిలో వెండి, రూ.2 లక్షల నగదు ముట్టజెప్పారు. భర్త అత్తమామలతో కలిసి నెల రోజులు అత్తవారింట్లోనే ఉంది అరుణ.

ఆ తరువాత అరుణను ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలేసి భర్త, అత్తమామలు పారిస్ వెళ్లిపోయారు. కొద్ది రోజుల తరువాత వచ్చి తీసుకువెళతాని భార్యను నమ్మించాడు పెరుమాళ్లు. ఎప్పుడు తీసుకెళతారు అని అడిగినప్పుడల్లా 20 సెంట్ల భూమిని తన పేరిట రిజిస్టర్ చేసి మరో రూ.10 లక్షలు కట్నం ఇస్తేనే తీసుకెళతానని పెరుమాళ్లు చెప్పేవాడు భార్యతో. ఇదే మాట తండ్రితో చెప్పింది అరుణ. తండ్రి అల్లుడితో ఫోన్‌లో మాట్లాడి వచ్చే సంక్రాంతి నాటి అడిగినవన్నీ ఇస్తామని నచ్చజెప్పారు.

అయినా భర్త నమ్మలేదు. వచ్చి తీసుకువెళతానని కూడా అనలేదు. దీంతో మనస్థాపం చెందిన అరుణ బుధవారం ఉదయం భర్త నుంచి ఫోన్ రావడంతో అరగంటకు పైగా వీడియోకాల్ మాట్లాడింది. భర్త ధోరణిలో ఏమాత్రం మార్పులేదు. అరుణ మనసు విరిగిపోయింది. భర్తతో మాట్లాడుతూనే ఇంట్లో ఉరి వేసుకుంది. ఆ దృశ్యాలను వీడియో కాల్‌లో చూసిన పెరుమాళ్లు తల్లి చిన్న అమ్మాజీ కంగారు పడుతూ అరుణ సోదరి సుమకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే సుమ వెళ్లి చూసేసరికే అక్క అరుణ
ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. కొనఊపిరితో ఉన్న అరుణను హుటాహుటిన అమలాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.