సౌతాంప్టన్‌లో అదరగొట్టిన భారత్

మూడో టెస్ట్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో సౌతాంప్టన్‌లోనూ భారత్ అదరగొట్టింది. నాలుగో టెస్ట్‌లో తొలిరోజే భారత్‌ పైచేయి సాధించింది. మరోసారి బౌలర్లు సమష్టిగా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 246 పరుగులకే ఆలౌట్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు ఆరంభం నుంచే తడబడింది. భారత పేసర్లు చెలరేగడంతో కేవలం 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌.. కుర్రాన్ , మొయిన్ అలీ పార్టనర్‌షిప్‌తో కోలుకుంది. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కుర్రాన్ చివర్లో బ్రాడ్‌తోనూ కీలక పార్టనర్‌షిప్ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ 240 దాటింది. కుర్రాన్ 78 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

బూమ్రా స్వింగ్‌ డెలివరీలతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లను హడలెత్తించాడు.. కీటన్‌ జెన్నింగ్స్‌ను డకౌట్‌ చేసి షాకిచ్చాడు. బూమ్రా మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. ఇశాంత్‌, షమీ, అశ్విన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టడంతో.. ఇంగ్లండ్‌ 246 పరుగులతో సరిపెట్టుకుంది. అనంతరం బరిలోకి దిగిన భారత్‌.. ఆటముగిసే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 19 పరుగులు చేసింది.. ధవన్‌ మూడు పరుగులు, కేఎల్‌ రాహుల్‌ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.