వాట్సప్‌లో యువతి ఫోటో.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈవ్ టీజింగ్‌కు విద్యార్థిని బలైంది. జిల్లాలోని ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన కావ్య ఇంటర్ చదువుతోంది. అదే కాలేజ్‌లో చదువుతున్న కొంత మంది విద్యార్థులు కొద్ది రోజులుగా ఆమెను మానసికంగా వేధిస్తున్నారు. క్లాస్‌మేట్‌తో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఓ ఫొటోను వాట్సప్‌లో షేర్ చేశారు. ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అర్థం వచ్చేలా వారు వ్యవహరించిన తీరుతో కావ్య మనస్తాపానికి గురయ్యింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కావ్య మరణానికి పవన్ అనే యువకుడే కారణమంటూ అతని ఇంటి ముందు డెడ్‌బాడీతో ధర్నాకు దిగారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు షేర్ చేసిన వారిపై కేసు నమోదు చేశారు. దీనంతటికీ కారణమని భావిస్తున్న పవన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కాలేజీలో ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు మొదలు పెట్టారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -