హరికృష్ణతో సెల్ఫీలు.. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాజమాన్యం

kamineni hospital taken action on disrespectful-hospital-staff-take-selfie-actor-harikrishna

సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు.. ఆయనను నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆయన మృతి చెందారు. అయితే అక్కడి సిబ్బంది హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీలు దిగారు. పైగా వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్స్ వారిని ఘాటుగానే విమర్శించారు. ఈ క్రమంలో కామినేని ఆసుపత్రి యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది.

‘మా కామినేని ఆసుపత్రులలో మేము.. మా రోగులు మరియు వారి ఆరోగ్య వివరాలను చాలా గోప్యంగా ఉంచుతాము. కానీ మా సిబ్బంది చేసిన తప్పిదం వలన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగింది. మా ఆసుపత్రిలో పనిచేసే కొందరి తప్పిదానికి, గట్టిగా చర్యలు తీసుకుంటాం. మరియు హరికృష్ణ గారి శ్రేయోభిలాషులకు, అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాం’ అని కామినేని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.