పిచ్చికి పరాకాష్ట.. ఆసుపత్రిలో ఉన్న హరికృష్ణతో సెల్ఫీలు..

selfie

ప్రస్తుతం యువతలో సెల్ఫీ పిచ్చి పీక్‌ స్టేజ్‌కి వెళ్లిపోతోంది.. సోషల్‌ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈసెల్ఫీ పిచ్చిలో జనం మానవత్వం మరిచిపోతున్నారు.  చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లతో కూడా ఫొటోలు దిగి ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటున్నారు.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న వారు కూడా ఈ సెల్ఫీ మోజులో పడి తప్పుదారి పడుతున్నారు. నందమూరి హరికృష్ణ విషయంలో.. కామినేని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన హరికృష్ణను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లు.. ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే నర్సులు, వార్డుబాయ్‌లు సెల్ఫీకి ప్రాధాన్యం ఇచ్చారు. హరికృష్ణ ఒంటికి అంటిన రక్తాన్ని తుడవాల్సిందిగా డాక్టర్ ఆదేశిస్తే.. అదే అదునుగా ఎవరూ చూడకుండా సెల్ఫీ దిగారు. తర్వాత దాన్ని ఫ్రెండ్స్‌కి షేర్ చేశారు. తాము హరికృష్ణకు ట్రీట్‌మెంట్ చేస్తుండగా అక్కడే ఉన్నామని.. తామే డ్యూటీలో ఉన్నామని గొప్పగా చెప్పుకున్నారు.

హరికృష్ణ మామూలు స్థితిలో ఆస్పత్రికి వచ్చినప్పుడు సెల్ఫీ దిగితే ఓకే. కానీ, ఆయన కొనఊపిరితో ఉన్నప్పుడు వీళ్లు సెల్ఫీ దిగారు. అయ్యో పాపం అన్న సానుభూతి కూడా లేకుండా కేవలం తాము ఓ సెలబ్రిటీకి వైద్యం చేస్తున్నామని చెప్పుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. అతి దారుణంగా ఈ నలుగురు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శల పాలయింది. ఇద్దరు నర్సులు, వార్డ్‌ బాయ్స్‌పై కామినేని ఆస్పత్రి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఈ ఫొటో చూసిన వాళ్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

సెల్ఫీ పిచ్చి ఏ స్థాయికి దిగజారిందో, కనీస మానవత్వ విలువల్లేకుండా వీళ్లు ఎంత అరాచకంగా ప్రవర్తించారో చూస్తే ఈ చర్యను అసహ్యించుకోకుండా ఉండలేం. ఎవడో రోడ్డున పోయే వాడు.. యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌లో నిలబడి ఫొటో తీసుకున్నాడంటే వాడి స్థాయి అంతే అని ఊరుకోవచ్చు. కానీ ఏకంగా నర్సులే ఇలా కొనఊపిరితో ఉన్న హరికృష్ణతో సెల్ఫీ దిగడం వివాదాస్పదమైంది. నర్స్‌ డ్యూటీ అంటేనే ఎంతో మానవత్వంతో కూడుకున్న ఉద్యోగం. చికిత్సకోసం వచ్చిన వాళ్లను ప్రేమతో చూడడం, మర్యాదగా ప్రవర్తించడం వాళ్ల ప్రథమ కర్తవ్యం. కానీ, నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో ఈ నర్సులు అవన్నీ మర్చిపోయారు. సెలబ్రిటీతో ఫొటో తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చి.. విలువలు ఏ స్థాయికి పతనం అయ్యాయన్న దానికి ఉదాహరణగా నిలిచారు.