ఈసారి ఆ ఎమ్మెల్యేకు టికెట్ లేదా..?

banothu madhan lal has maybe no ticket by next election

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో సుమారు లక్ష 60వేల మంది ఓటర్లున్నారు..ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం అయిన ఈ ప్రాంతంలో లంబాడాలు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఇదే సామాజిక వర్గానికి చెందిన మదన్ లాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ నుంచి గెలిచినా.. తర్వాత ఆయన అధికారపార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ ఆయనే.. నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనంటూ కేసీఆర్ చెప్పారు. అందులో మదన్ లాల్ పేరు ఖచ్చితంగా ఉంటుందని నియోజకవర్గంలో ప్రచారముంది. ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు.. ఒకటి ఆయన దూకుడు వ్యవహారం.. రెండోది ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించడం. మదన్ లాల్ కు టికెట్ ఇస్తే.. గెలవడం కష్టమని… ఆ ప్రభావం ఎంపీ సీటుపైనా పడుతుందని పొంగులేటి అంటున్నారు. మదన్ లాల్ ను తప్పనిసరిగా మార్చాలని ఎంపీ ఇప్పటికే నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి మదన్ లాల్ వైరా నుంచి పోటీచేసినప్పుడు.. ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే విజయానికి సహకరించారు. తర్వాత కాలంలో ఇద్దరూ ఒకేసారి పార్టీ మారారు.. అప్పటి నుంచి ఇరువురి మధ్య విబేధాలు మొదలయ్యాయి. పెద్ద మునగాల గ్రామంలో జరిగిన ఓ సమావేశంలో ఎంపీ డౌన్ డౌన్ అంటూ ఎమ్మెల్యే స్వయంగా నినాదాలు చేసేదాకా పోయింది. ప్లెక్సీ వార్.. ఇరువర్గాల ఘర్షణలు సర్వసాధారణం అయ్యాయి. ఎంపీ నిధులతో చేపట్టిన అభివృధ్ధి పనులకు కూడా సంతకాలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలున్నాయి. ఇక వైరాలో మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యే అనుచరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. దీనికి తోడు… ఆయనకు నచ్చిన వారిని అధికారులుగా నియమించడం.. నచ్చకపోతే బదిలీలు చేయించడం పట్ల విమర్శలున్నాయి. తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారన్న కారణంగా మీడియా ప్రతినిధులపై కేసులు కూడా పెట్టించినట్టు ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే తీరుతో విసిగిన అతని అత్యంత సన్నిహితుడు తన్నీరు వెంకటేశ్వరరావు సైతం దూరమయ్యారని టాక్. ఎమ్మెల్యే కారణంగా తన విలువైన ఆస్తిని పొగొట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈగో కారణంగా.. ఎంపీ కంటే నేనేం తక్కువ అన్న భావంతో పార్టీలో గ్రూపులు తయారుచేశారు. తనదైన శైలి దుందుడుకు తనంతో ప్రజలకు దూరమయ్యారన్న ప్రచారం జరగుతోంది. కేసీఆర్ చేసిన సర్వేలో కూడా మదన్ లాల్ గ్రాఫ్ దారుణంగా పడిపోయినట్టు తెలుస్తోంది. చివరకు సొంత సామాజిక వర్గం కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశాయి. గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నాయి. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మదన్ లాల్ వ్యవహారంలో చేతులెత్తేసినట్టు చెబుతున్నారు. టిఆర్ఎస్ లో టికెట్ రేసులోకి మాజీ ఎమ్మెల్యే చంద్రావతి వచ్చారు. ఎంపీ పొంగులేటితో పాటు… మంత్రి కేటీఆర్ అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది.

మదన్ లాల్ పై వ్యతిరేకతను కాంగ్రెస్ నాయకులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. లావుడ్యూ రాములు నాయక్, గిరిబాబు, రాంచంద్రనాయక్ లలో ఒకరికి హస్తం పార్టీ టికెట్ దక్కే అవకాశం ఉంది. అయితే పొత్తులు కుదిరితే ఈ టికెట్ సీపీఐ అడిగే అవకాశం ఉంది. వామపక్షపార్టీ పోటీచేస్తే లాల్ సింగ్ బరిలో దిగుతారని చెబుతున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -