బీజేపీ నేత కొడుకు వీరంగం.. మద్యం మత్తులో కారు నడిపి.. ఇద్దరి ప్రాణాలు..

అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా అడిగేవాడు లేడు. తాగొచ్చు.. తాగి డ్రైవ్ చేయొచ్చు. ఎవరి ప్రాణాలైనా తీయొచ్చు. అదేమని ప్రశ్నిస్తే అడిగిన వారిని కూడా అడ్రస్ లేకుండా చేయగల సత్తా ఉంది. రాజస్థాన్ జైపూర్‌కి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా నేత బద్రి నారాయణ మీనా కుమారుడు భరత్ భూషన్ మీనా, అతడి మిత్రులు కలిసి మద్యం సేవించి కారు నడుపుతున్నారు.

అమిత వేగంతో వస్తున్న కారు గాంధీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్లైఓవర్ కింద పేవ్‌మెంట్‌ని ఢీకొట్టింది. దాంతో అక్కడి నుంచి పారి పోవడానికి ప్రయత్నించే తరుణంలో కారుపై నియంత్రణ కోల్పోయారు. వేగంగా వస్తున్న కారు అక్కడే ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది.

తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆస్పత్రిలో చేర్పించగా అందులో ఇద్దరు కార్మికులు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు భరత్‌పై హత్యాయత్నం, మద్యం సేవించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేశారు.