ఎదురుగా కూర్చుంది.. చూపులతో చంపేసింది: ఆమె కోసం ఊరంతా..

ఒక్కసారే చూసింది. ఒళ్లంతా తన చూపులతో తడిమింది. ఆమెను మర్చిపోలేక మంచం పట్టే పరిస్థితి వచ్చేసింది. లాభంలేదని ఓ ఐడియా ప్లాన్ చేసాడు. పక్కాగా అమలు పరిచాడు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఏమో.. అచ్చంగా సినిమాని తలపించేలా ఉంది విశ్వజిత్ కథ. కోలకతాకు చెందిన విశ్వజిత్ చూపులతో గుచ్చేసిన ఆ యువతి పట్ల ప్రేమను పెంచేసుకున్నాడు.

ఊరు పేరు తెలియని ఆమె కోసం ఊరంతా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4వేల పోస్టర్లు అంటించాడు. 29 ఏళ్ల విశ్వజిత్ పొద్దర్ కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌లో రాష్ట్రపర్యావరణ శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. బెహలాలో నివసిస్తున్న విశ్వజిత్ రోజూ లోకల్ ట్రైన్‌లో ఉద్యోగానికి వెళుతుంటాడు. అప్పటివరకు బాగానే ఉన్న విశ్వజిత్‌ హృదయంలోకి ఓ అమ్మాయి వచ్చింది. జులై 23న ఎప్పటిలానే ఆఫీస్‌కి వెళ్లడానికి రైలెక్కాడు. అతడికి ఎదురు సీట్లో ఓ అమ్మాయి ఆమె అమ్మానాన్నలతో రైలెక్కింది. ఆమెని అతడు, అతడిని ఆమె చూసుకున్నారు.

అబ్బాయికి ఆమెని చూసిన దగ్గరనుంచి మనసులో ఏదో అలజడి సొద చేస్తోంది. వారితో మాట కలిపి ఎక్కడుంటారు అని మాత్రం తెలుసుకోగలిగాడు. కొన్నాగర్ అని చెప్పారు. కానీ ఆ అమ్మాయి పేరుని అడిగే ధైర్యం చేయలేకపోయాడు. చేసేదేం లేక నోరు మూసుకుని కళ్లు మాత్రమే తెరిచి ఆమెను చూస్తుండిపోయాడు. ఈలోగా ఆ అమ్మాయి దిగే స్టేషన్ వచ్చి అమ్మానాన్నలతో వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఏదో సైగలు చేసి మరీ వెళ్లింది. దాంతో ఇంక అతడి ఊపిరి ఆగినంత పనైంది. ఆమె వెళ్లిపోయింది కానీ.. ఆమె చూపుల్ని, ఆమె రూపాన్ని తన హృదయంలో పదిలం చేసుకున్నాడు.

ఈ లోపు అతడు దిగాల్సిన నెక్ట్స్ స్టాప్ కూడా వెళ్లిపోయింది. ఆ తరువాత వచ్చిన స్టేషన్‌లో దిగి ఆమె దిగిన స్టేషన్‌కి మళ్లీ వచ్చాడు. ఆమె పేరు తెలియదు. కనీసం ఫొటో కూడా లేదు. ఎక్కడని వెదుకుతాడు. ఏం చేయాలో పాలుపోలేదు. ఆలోచించాడు. జుట్టు పీక్కున్నాడు. వెంటనే ఓ ఐడియా వచ్చింది బుర్రలోకి. అదే డ్రస్‌తో వెళ్లి ఫొటో దిగాడు. మొత్తం 4 వేల పోస్టర్లు వేయించాడు. ఆమె ఉంటున్న కొన్నాగర్ ఏరియాతో పాటు, బాలి, నబగ్రమ్, ఉత్తర్‌పర, హింద్‌ మోటార్ ప్రాంతాల్లో కూడా పోస్టర్లు అంటించాడు. పోస్టర్‌పై తన ఫోన్ నెంబర్ వేయించాడు ప్రత్యేకంగా.

యూట్యూబ్‌లో ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కొన్నాగరర్ కొనే’ (అంటే కొన్నగర్ పెళ్లి కూతురు) అని వీడియో లింక్ పెట్టాడు. అవి చూసి తప్పకుండా తనకు ఫోన్ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆ అందాల రాక్షసి, కలల రాకుమారి తన జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటున్నాడు. సో.. విశ్వజిత్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.