ప్రేమ పెళ్లి.. అక్రమ సంబంధం.. ఆత్మహత్య

married woman, love marriage

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నువ్వు లేకుండా బతకలేనన్నాడు. అతడి ప్రేమ నిజమని నమ్మింది ఆ యువతి. అతడి ప్రేమ కోసం తల్లిదండ్రులనే ఎదిరించింది. కానీ ఆ నీచుడు మోజు తీరాక అసలు స్వరూపం బయటపెట్టాడు. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యాపిల్లలను పట్టించకోవడం మానేశాడు. భార్యకు వేధింపులు మొదలుపెట్టాడు. భర్త మోసాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఇల్లాలు తనను క్షమించాలంటూ తల్లిదండ్రులను వేడుకుంది. సూసైడ్ లెటర్ రాసి తనువు చాలించింది.

అమ్మానాన్న, అన్నా, అక్కా నన్ను క్షమించండి. మిమ్మల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నేను తనువు చాలిస్తున్నాను. నా పిల్లలను కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇది అనురాధ సూసైడ్ లెటర్. ఈ లేఖ అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది.

తనను ప్రేమిస్తున్నవాడిని పెళ్లి చేసుకోవడానికి మించిన అదృష్టం ఏముందని పొంగిపోయింది అనురాధ. అతడి కోసం కన్నవారినే ఎదిరించింది. కానీ భవిష్యత్తులో అదే తనకు శాపమవుతుందని ఆమె కలలో కూడా ఊహించలేకపోయింది. కట్టుకున్నవాడు కడదాకా తోడుంటాడని భావించింది. కానీ ఆ నీచుడు పైకి ప్రేమ నటిస్తూనే గుంటనక్కలా వ్యవహరించాడు. మోజు తీరగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు యాదగిరి. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేకోపోయింది అనురాధ.

ఈ విషాదం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన అనురాధ… ఇంటర్ వరకు చదువుకుంది. ఆమె కాలేజీకి వెళ్తున్న టైంలోనే అదే గ్రామానికి చెందిన యాదగిరి ప్రేమ పేరుతో అనురాధకు దగ్గరయ్యాడు. అయితే జులాయిగా తిరుగుతుండడంతో అతడితో పెళ్లికి ఒప్పుకోలేదు అనురాధ కుటుంబసభ్యులు. కానీ ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన యాదగిరి… నువ్వు లేకుండా బతకలేనంటూ మొసలి కన్నీళ్లు కార్చాడు. అతడి ప్రేమ నిజమేనని భావించిన అనురాధ… తల్లిదండ్రులను ఎదిరించి ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుంది.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత యాదగిరి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. భార్యపై మోజు తీరడంతో మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్య నిలదీయడంతో వేధింపులు మొదలు పెట్టాడు. ప్రేమించినవాడే మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన అనురాధ… జులాయిగా తిరిగేవాడితో తల్లిదండ్రులు పెళ్లి ఎందుకు వద్దన్నారో తలుచుకుని కుమిలిపోయింది. నేను తప్పుచేశాను, నన్ను క్షమించండి అంటూ సూసైడ్ లెటర్ రాసింది. తను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలంటూ కుటుంబసభ్యులను కోరింది.

తన భర్త చేసిన మోసానికి తీవ్రంగా మనస్తాపం చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది అనురాధ. అనురాధ ఆత్మహత్య చేసుకోవడంతో యాదగిరి పరారయ్యాడు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే మృతురాలి కుటుంసభ్యులు యాదగిరి ఇంటిపై దాడి చేశారు. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. మృతదేహాన్ని యాదగిరి నట్టింట్లో పెట్టి ఆందోళనకు దిగారు.

అనురాధ సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న యాదగిరి కోసం గాలిస్తున్నారు.