సంతలో సమంత.. నిమిషాల్లో షాపు ఖాళీ.. పర్సు ఫుల్

సినిమాలో పాత్ర కోసం వేసిన వేషం కాదండి.. నిజంగా నిజం.. గురువారం చెన్నై వెళ్లిన సమంత ట్రిప్లికేన్‌లోని జాంబజార్‌లో ఉన్న ఓ షాపులో కూర్చుని కూరగాయలను అమ్మింది. తన ప్రత్యూష ఛారిటబుల్ ట్రస్ట్ కోసం నిధులను సేకరిస్తోంది. అందులో భాగంగానే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అందించే వైద్యం కోసం నిధులను సేకరిస్తున్నట్లు చెప్పింది.

కూరగాయలు అమ్ముతానని సమంత అడగడంతో షాపు యజమాని అంతకంటే భాగ్యమా.. సమంత వచ్చి నా షాపులో కూర్చుంటే నాక్కూడ ప్లస్సే కదా అనుకుని ఆనందంగా ఒప్పుకున్నాడు. వెంటనే దుకాణంలో కూర్చుని వంకాయలు, బెండకాయలతో పాటు మరికొన్ని కూరగాయలను అమ్మేసింది. సమంత అమ్ముతున్న కూరగాయల కోసం క్యూలో నిల్చున్నారు వినియోగదారులు. నిమిషాల్లో షాపు ఖాళీ.. సమంత పర్సు ఫుల్.

ఈ మధ్య హీరో హీరోయిన్లు షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తమ వంతు సాయం చేస్తున్నారు. అనారోగ్య బాధితులకు అండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ మార్పుని అభిమానులు స్వాగతిస్తున్నారు.