టారిఫ్‌ వార్-అమెరికా మార్కెట్లు డీలా

చైనా దిగుమతులపై సెప్టెంబర్‌ 5నుంచీ అమలు చేయనున్న టారిఫ్‌లపై వెనక్కి తగ్గేదిలేదంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా స్పష్టం చేయడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలహీనపడ్డాయి. డోజోన్స్‌ 138 పాయింట్లు(0.55 శాతం) క్షీణించి 25,987 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 13 పాయింట్లు(0.45 శాతం) తిరోగమించి 2,901కు చేరింది. నాస్‌డాక్‌ సైతం 21 పాయింట్లు(0.26 శాతం) నష్టపోయి 8,088 వద్ద  స్థిరపడింది. వెరసి సరికొత్త గరిష్టాల నుంచి ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ వెనకడుగు వేశాయి. 24ఏళ్ల క్రితం కుదుర్చుకున్న నాఫ్టా ఒప్పందాన్ని సవరించే బాటలో ట్రంప్‌ ప్రభుత్వం మెక్సికోతో ఒప్పందాలను కుదుర్చుకున్నప్పటికీ కెనడాతో చర్చలు అంతంత మాత్రంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కెనడాతో చర్చలు నేటితో ముగియనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనైనట్లు నిపుణులు పేర్కొన్నారు. అమెరికా, మెక్సికో, కెనడా మధ్య 1994 నుంచీ అమల్లోకి వచ్చిన ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం స్థానే సరికొత్త ఒప్పందాలను కుదుర్చుకోవాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.

బ్లూచిప్స్‌ వీక్‌
కేటర్‌పిల్లర్‌ 2 శాతం, బోయింగ్‌ 1 శాతం చొప్పున క్షీణించాయి. బాటిల్‌ఫీల్డ్‌ గేమ్‌ -5 వెర్షన్‌ విడుదల ఆలస్యంకావడం, గైడెన్స్‌ నిరాశపరచడం వంటి అంశాల కారణంగా ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌ కౌంటర్‌ దాదాపు 10 శాతం కుప్పకూలింది. కాగా.. అర్జెంటీనా, టర్కీలలో సంక్షోభం తలెత్తడంతో డాలరు ఇండెక్స్‌ బలపడింది. అర్జెంటీనా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరోసారి పెంచడం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి వడ్డీ రేట్లను చేర్చడంతో కరెన్సీ పెసో పతనమైంది. అమెరికన్‌ ట్రెజరీలకు డిమాండ్‌ పుట్టగా.. ఇటాలియన్‌, గ్రీకు తదితర యూరోపియన్‌ బాండ్లు నీరసించాయి. రెండో క్వార్టర్‌ జీడీపీ అంచనాలను చేరకపోవడంతో కెనడియన్‌ డాలర్ క్షీణించింది. మరోపక్క టర్కీ కేంద్ర బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ రాజీనామా చేయనున్న వార్తల నేపథ్యంలో లైరా పతనమైంది. యూరో 1.167కు చేరగా.. జపనీస్‌ యెన్‌ 111ను తాకింది.

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.