మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే వివిధ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించిన ఆయన.. తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ WTO కూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా పట్ల WTO అనైతికంగా వ్యవహరిస్తోందన్నారు. ఒకవేళ WTO తన రూల్స్‌ను మార్చకపోతే ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు.

ఇప్పటి వరకూ పారిస్‌ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం, ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం వంటి వాటి నుంచి వైదొలగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన నిష్క్రమణ పర్వంలో తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి కూడా తప్పుకుంటామని బెదిరించారు. ప్రపంచ దేశాల వాణిజ్యం విషయంలో సక్రమంగా వ్యవహరించకపోతే తాము ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నుంచి వైదొలగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన మల్టీపర్పస్‌ వాణిజ్య వ్యవస్థ అయిన ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటులో అమెరికా కీలక పాత్ర పోషించింది. ట్రంప్‌ వరుసగా ప్రకటిస్తున్న రక్షణాత్మక విధానాలు వాణిజ్య పోరుకు తెరతీస్తున్న నేపథ్యంలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఈ సంస్థ కృషి చేస్తోంది.. ఇప్పుడు అమెరికా సహాయ నిరాకరణతో ఈ సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. WTOలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఒక న్యాయమూర్తి పునర్ణియామకాన్ని ట్రంప్‌ సర్కారు తిరస్కరించటంతో ఈ సంస్థ వాణిజ్య వివాదాల పరిష్కార సామర్ధ్యాన్ని కోల్పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐరోపా కూటమి కూడా చైనా లక్షణాలను కలిగినదేనని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికన్‌ కార్ల దిగుమతులపై ఐరోపా కూటమి సుంకాలు విధించింది. తమ వస్తువులపై అదనంగా విధించిన దిగుమతి సుంకాలను అమెరికా తగ్గిస్తే తాము అమెరికన్‌ కార్లపై విధించిన సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని ఐరోపా కూటమి వెల్లడించింది.