వైఎస్ వర్థంతి సందర్భంగా చంద్రబాబు ట్వీట్ !

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ వర్థంతి రోజున ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది వైఎస్సాఆర్ కాంగ్రెస్. ఇడుపులపాయలో ఆయన కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పాదయాత్రలో ఉన్న జగన్.. శిబిరం దగ్గర వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తండ్రి ఆశయాల సాధన కోసమే తన జీవితాన్ని అంకితం ఇచ్చానని అన్నారాయన.

మరోవైపు సీఎం చంద్రబాబు వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో వర్ధంతిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించింది వైఎస్సాఆర్ కాంగ్రెస్. ఊరువాడ ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ పార్టీ నేతలు. మాజీ సీఎంను స్మరించుకున్నారు.

ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్..అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం దగ్గర వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి..శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజా సంక్షేమం కోసం తండ్రి చేసిన సేవలను స్మరించుకున్నారు. నాన్న ఆశయాలే తనకు మార్గదర్శమని..ఆయన ఆశయ సాధన కోసమే తన జీవితాన్ని అంకితం ఇచ్చానని ట్వీట్ చేశారు జగన్. జగన్ కుటుంబసభ్యులు ఇడుపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర ఘనంగా నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలకు వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్న కుటుంబసభ్యులు..ఆయన కారణ జన్ముడని అని కీర్తించారు.

ఇక మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారీ భైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో 5 వేల మందికి చీరల పంపిణి చేశారు. 20 వేల మందికి అన్నదానం నిర్వహించారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించింది వైఎస్సార్ కాంగ్రెస్ . పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని..వైఎస్ ను స్మరించుకున్నారు.

ఏలూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్ కు నివాళులు అర్పించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. పేదలకు ఆయన చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. ఇక గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాత్రం వర్ధంతి కార్యక్రమం వర్గ పోరుకు వేదికగా మారింది. మర్రి రాజశేఖర్, విడదల రజని వర్గాలు పోటాపోటీగా నివాళులు అర్పించారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తమదే అంటూ ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అటు చెన్నైలోనూ వైఎస్ వర్థంతిని నిర్వహించారు. వైఎఎస్ఆర్ కాంగ్రెస్ తమిళనాడు కార్యకర్తలు వైఎస్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.