వైద్య ఆరోగ్య శాఖ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

cm-chandrababunaidu-fire-on-health-ministry

ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ కేసులు పెరిగిపోతుండటం, మరణాలు సంభవిస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.. డెంగీ టెర్రర్‌ సృష్టిస్తుంటే ఏం చేస్తున్నారని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యపై చంద్రబాబు మండిపడ్డారు. రెండ్రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దకుంటే తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రతోపాటు, ఇతర జిల్లాల్లో ప్రబలుతున్న వ్యాధుల నివారణకు వెంటనే చర్యలు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం ఉందని, అవసరమైన సౌకర్యాలు సమకూర్చామని.. అంటు వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల గురించి తెలిసి కూడా తగిన చర్యలు తీసుకోకపోవడమేంటని నిలదీశారు. సోమవారానికల్లా పూర్తి వివరాలు సమర్పించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. అయితే, పరిస్థితి బాగోలేని చోట ఇంటింటికీ వెళ్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అధికారుల సమాధానంపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఇంటింటికీ వెళ్తే పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుందన్నారు. పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇదొక అత్యవసర పరిస్థితిగా భావించాలని సూచించారు. సోమవారం మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నారు చంద్రబాబు.