వైసీపీలోకి వెళ్లిన ఆ నేత తిరిగి టీడీపీలోకి..?

ex-minister-daadi-veerabadrarao-political-re-entry-maybe-on-tdp

ఉత్తరాంధ్ర రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన వీరభద్రరావు తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని నాయకుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపోటములతో సంబంధం లేకుండా 2014 వరకూ చక్రం తిప్పారు. మంత్రిగా, మండలిలో విపక్ష నేతగా కీలక పదవులు చేపట్టారు. అయితే ఎమ్మెల్సీ సీటు విషయంలో 2014లో అధినేత చంద్రబాబుపై అలిగి పార్టీకి దూరమయ్యారు. వైసీపీ గూటికి చేరారు. తాను ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండి.. వారసుడ్ని విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. కానీ భంగపాటు తప్పులేదు. సొంత నియోజకవర్గం కాకపోవడం… టీడీపీ వీడడం అన్నీ కలిసి ఆయన కుటుంబానికి రాజకీయాల్లో చేదు ఫలితాలు వచ్చాయి. ఎంతో అనుభవం ఉన్న దాడి వీరభద్రరావు వైసీపీలో ఉండలేకపోయారు. జగన్ వ్యక్తిత్వం నచ్చలేదంటూ పార్టీ వీడారు.. నాలుగేళ్లుగా ఆయన కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటోంది. అయితే ప్రజాఉద్యమాలు, ఇతర ప్రజాసంఘాల కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. ప్రజాజీవితం పూర్తిగా వదులుకోలేదు. రైతు సమస్యలు, విభజన హామీలపై గళం వినిపిస్తూనే ఉన్నారు.

ex-minister-daadi-veerabadrarao-political-re-entry-maybe-on-tdp

ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ దాడి వీరభద్రరావు ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కోసం చూస్తున్నారు. ఏదోపార్టీలో చేరి రాజకీయంగా ఉనికి చాటుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా దాడి పుట్టిన రోజు వేళ నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయన గతానుభవాల నేపథ్యంతో తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తప్పించుకున్నారు. జనసేనలో చేరాలని భావించినా.. విధానాలు, సిద్దాంతాల పట్ల స్పష్టత లేకపోవడం ఆయన్ను ఆలోచనలో పడేసింది. అయితే దాడి మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కొత్తపార్టీ అని వైసీపీలో చేరి దెబ్బతిన్నామని.. కష్టమో… నష్టమో రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీనే తమకు కరెక్ట్ అన్న భావనలో ఉన్నారు. టీడీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తే… టీడీపీ లేదంటే ఆప్షన్ జనసేన అంటున్నారు అనుచరులు. మొత్తానికి దాడి మళ్లీ యాక్టీవ్ రాజకీయాల్లోకి రావడం ఖాయమైంది.. కాకపోతే.. ఏ పార్టీ అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆయన ఏ పార్టీలో చేరినా.. జిల్లా రాజకీయాల్లో ఓ మలుపుగానే చూడాలి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -