రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న ముందస్తు సందిగ్దత

రాష్ట్ర రాజకీయాల్లో ముందస్తు సందిగ్థత కొనసాగుతోంది. తాడోపేడో తేల్చేస్తుందనుకున్న కేబినెట్ సమావేశం ముందస్తుపై చర్చ లేకుండానే ముగిసింది. అయితే..బీసీ కుల సంఘాలకు స్థలాలతో పాటు అర్చకుల రిటైర్మెంట్ వయస్సును పెంపునకు ఆమోదం తెలిపింది. ఇలాగే వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, అశావర్కర్లు, గోపాల మిత్రలకు వేతనాలను వరాలు పెంచాలని నిర్ణయించింది. అయితే..త్వరలోనే మళ్లీ కేబినెట్ సమావేశం ఉండటంతో ముందస్తు ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.

స్టేట్ లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన కేబినెట్ మీటింగ్ విధాన నిర్ణయాలకే పరిమితం అయ్యింది. భారీ బహిరంగ సభకు ముందు హడావుడిగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయటంతో అసాధారణ ప్రకటన ఎదో ఉంటుందని భావించారంతా. దీంతో మంత్రివర్గ సమావేశ నిర్ణయాలపై తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూశాయి. అయితే..కేసీఆర్ కేబినెట్ తమ భేటీలో ముందస్తు ప్రస్తావన లేకుండానే ముగించేసింది. అదే సమయంలో కొన్ని వర్గాలకు వరాలు ప్రకటించింది.

రాష్ట్రంలోని బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 71 ఎకరాల్లో చేపట్టే ఈ నిర్మాణాల కోసం 71కోట్ల రూపాయిలు కేటాయించాలని నిర్ణయించింది. అర్చకుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. అలాగే అర్చకుల జీతభత్యాలు ప్రభుత్వ పరంగా చెల్లించాలని నిర్ణయించారు. ఇక NUHM 9 వేల మందికి కనీస వేతనాలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనాన్ని 40 వేలకు పెంచారు. సెకండ్ ఏఎన్‌ఎంలుకు రూ.11 వేల నుంచి 21 వేల రూపాయలకు పెంపు, గోపాల మిత్రల వేతనం 3,500 నుంచి 8500 రూపాయలకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం 6 వేల నుంచి 7500 లకు పెంపు, హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయించుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

అయితే..మరో వారంలోగా మరోసారి కేబినెట్ సమావేశం కాబోతోంది. అప్పటి సమాశంలోనే ఉద్యోగులకు ఐఆర్ నిర్ణయం ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే శాసనసభ రద్దుపై సంచలన నిర్ణయం కూడా ఉండొచ్చనే అంచనాలున్నాయి. దీంతో ముందస్తు హైప్ మరోసారి జరగబోయే కేబినెట్ సమావేశానికి షిఫ్ట్ అయ్యింది.