
పండుగొచ్చిందంటే పట్నం పల్లెబాట పడుతుంది. భాగ్యనగరం రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తాయి. ఇప్పుడు సీన్ రివర్స్. గులాబీ పండుగను జరుపుకునేందుకు పల్లె పట్నమొస్తోంది. హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్‌కు వాహనాలన్నీ క్యూ కట్టాయి. భాగ్యనగరం కొత్త కళ సంతరించుకుంది. నగరమంతా గులాబీ వనంలా మారింది. ఎటుచూసినా టీఆరెస్ జెండాల రెపరెపలే కనిపిస్తున్నాయి. టీఆరెస్ కేడర్ విజయ నినాదాలు చేసుకుంటూ ముందుకు ఉరుకుతున్నారు.
తెలంగాణ బండెనకబండి కట్టింది. హైదరాబాద్‌కు బారులు తీరింది. వివిధ మార్గాల్లో పాతిక లక్షల మంది సిటీ చేరుతున్నారు. అన్నిదారుల్లోను గులాబీ వాహన శ్రేణులే. అందరి పయనం కొంగరకలాన్వైపే. టీఆరెస్ ప్రగతి నివేదన సభలో భాగస్వామ్యం అయ్యేందుకు కేసీఆర్ అభిమానులు, టీఆరెస్ కార్యకర్తలు, ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే వేలమంది కొంగరకలాన్ చేరారు. సభా ప్రాంగణంలో చేసిన భారీ ఏర్పాట్లను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సభలు, సమావేశాలు పార్టీలకు కొత్తకాదు. కానీ కేసీఆర్ తలపెట్టిన ప్రగతి నివేదన సభ… పాతిక లక్షల మందితో నిర్వహించాలన్న సంకల్పం రికార్డ్‌గా మారబోతోంది. వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ వైపు వస్తున్నాయి. కొంగరకలాన్‌కు ఎప్పుడెప్పుడు చేరుకుందామా అని గులాబీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. కేసీఆర్ ప్రసంగం కోసం నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.