పెరుగుతుందంటే నమ్మింది.. కానీ మొత్తం ఊడింది.. అవమానంతో..

టీవీ ఆన్ చేస్తే బోలెడు ప్రకటనలు. పేపర్ తిరగేస్తే పెద్ద పెద్ద అక్షరాలు. లక్షల మందికి ట్రీట్ మెంట్ ఇస్తున్నాం. మీరు కూడా మీ లక్కు పరీక్షించుకోండి అంటూ రుజువు చేసే ప్రయత్నాలు. వెరసి మనుషులు బుట్టలో పడిపోతున్నారు. జుట్టు అసలే లేదంటే మొలిపిస్తాం. ఊడుతుందంటే దానికీ ట్రీట్‌మెంట్ ఉంది మా దగ్గర అంటూ మనుషుల వీక్‌నెస్ మీద దెబ్బ కొడుతూ అటువైపు అడుగులు వేయనిస్తాయి కొన్ని పార్లర్లు.

కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన నేహా గంగమ్మ బీబీఏ చదువుతోంది. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోవడంతో బెంగ పెట్టుకుంది. స్నేహితుల సలహా మీద మైసూరులోని ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లి కేశాలకు సంబంధించిన ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. అయినా జుట్టు ఊడడం ఆగక పోగా మరింత రాలడం మొదలైంది. ఆరు నెలల ట్రీట్‌మెంట్‌లో మొత్తం జుట్టూ ఊడిపోయి తల గుండులా మారింది. దీన్ని అవమానంగా భావించి కాలేజీకి వెళ్లడం కూడా మానేసింది.

మనో వేదనకు గురైంది. ఇంట్లో వారికి తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. నేహ కనిపించడం లేదంటూ పోలీసులకు సమాచారం అందించారు కుటుంబసభ్యులు. వారం రోజులుగా నేహ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు లక్ష్మణతీర్థ నదిలో ఆమె మృతదేహం లభించింది. జుట్టు మొత్తం రాలిపోవడం కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.