సరిహద్దుల్లో సైనికులు.. విధినిర్వహణలో ప్రాణాలు.. భార్య భావోద్వేగపు ఉత్తరం

పెళ్లయి ఏడాది కాకుండానే ఎడబాటు. విధినిర్వహణలో భాగంగా సరిహద్దుల్లో భద్రత కోసం రేయింబవళ్లు పహారా కాస్తుంటారు పోలీసులు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు సైతం ఫణంగా పెడుతుంటారు. భార్యా బిడ్డలను ఒంటరిని చేసి వెళ్లిపోతుంటారు. జమ్ముకశ్మీర్‌లో నిత్యం ఉగ్రదాడులు జరుగుతూ వారి కుటుంబాలకు నిద్ర లేకుండా చేస్తుంటాయి.

ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని అనుక్షణం అభద్రతా భావంతో జీవనం సాగిస్తుంటారు. ఓ పోలీస్ భార్య ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆవేదనతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దేశ భద్రత కోసం మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వారు ఒంటరి ప్రయాణం సాగిస్తారు. మా జీవితమంతా వారి కోసం ఎదురు చూడడంతోనే సరిపోతుంది. వస్తానని కబురు చేసిన రోజు రానే వస్తుంది.

అంతే త్వరగా గడిచిపోతాయి ఆ రోజులు. ఆ తియ్యని జ్ఞాపకాల్లోనే మా జీవితాలు కొనసాగించాలి. సరేలే.. ఎక్కడో ఒక చోట భద్రంగా ఉన్నారనుకోవడానికి లేదు. వారికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ముష్కరులు ఎటువైపు నించి వేటు వేస్తారో తెలియదు. అనుక్షణం భయం. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని కలత నిద్రలోనే రోజులు గడుస్తుంటాయి.

అమ్మా.. నాన్నెప్పుడొస్తారు.. ఒక్కసారి కూడా పేరెంట్స్ మీటింగ్‌కి రాలేదు అని చిన్నారులు అడిగితే ఈ సారి తప్పకుండా స్కూలుకి వస్తారంటూ అబద్దాలు.. ఒకటి కాదు రెండు కాదు.. రోజూ అబద్దాలే. అత్తామామలకు సైతం.. అమ్మా.. అబ్బాయి ఈసారి పండక్కైనా ఇంటికొస్తాడా అంటే వారికీ వస్తారు అత్తయ్యా.. అంటూ మరి కొన్ని అబద్దాలు. ఇలా అబద్దాలతో, అభద్రతో బతికేస్తూ నిద్రలో ఉలిక్కిపడితే వెన్నుతట్టే వారు కూడా లేక ఒంటరి జీవితాలను గడుపుతూ పేరుకి మాత్రం జవాన్ భార్యని అని చెప్పుకుంటూ జీవిస్తుంటాం.. అంటూ ఆరిఫా తౌసిఫ్ అనే మహిళ తన బాధను పంచుకున్నారు.