రూ.50 లక్షలు కట్టు లేదంటే ఆస్తులు జప్తు: తమిళ్ హీరోకు హైకోర్ట్ ఆర్డర్స్

కథని, హీరో హీరోయిన్లను నమ్ముకుని పెట్టుబడి పెడతారు నిర్మాతలు. ఈ సినిమా ఫలానా హీరో అని అనుకోగానే అతడితో సంప్రదింపులు జరిపి అడ్వాన్స్ చేతిలో పెడతారు. తన కాల్షీట్లు సర్దుబాటు చేసుకుని చెప్పిన టైమ్‌‌కి షూటింగ్‌కి హాజరవుతారు. మరి హీరోనే నమ్ముకుని పెట్టుబడి పెట్టిన నిర్మాతని నట్టేట ముంచితే వారి పరిస్థితి ఏంటి? తమిళ్ హీరో శింబు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు.

ఆ మధ్య నయన్‌ లవర్‌గా సందడి చేసినా మళ్లీ వాళ్లిద్దరి మధ్యా ఏం గొడవ జరిగిందో ఆ చాప్టర్ క్లోజ్ అయ్యింది. తాజాగా శింబు మరో వివాదంలో చిక్కుకున్నాడు. అరాసన్ చిత్రంలో నటించేందుకు నిర్మాత నుంచి రూ.50 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు 2013 జూన్ 17న. అయిదేళ్లవుతున్నా ఆ సినిమాలో నటించకపోగా తీసుకున్న డబ్బు కూడా ఇవ్వట్లేదంటూ నిర్మాత కోర్టుకెక్కారు. సరిగా షూటింగ్‌కి హాజరు కాకపోవడం, డబ్బింగ్ చెప్పమంటే బాత్‌రూమ్‌‌లో ఉండి చెప్పి పపండం వంటి తిక్క పనులన్నీ చేసి నిర్మాతకి చిర్రెత్తుకొచ్చేలా చేశాడు.

దాంతో ఓపిక నశించిన నిర్మాత శింబు పై కేసు వేయాల్సి వచ్చింది. షూటింగ్ ఉన్న ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడని.. దీంతో తాను చాలా నష్టపోయానని నిర్మాత కోర్టుకి విన్నవించుకున్నాడు. వాదోపవాదాలు విన్న మద్రాస్ హైకోర్టు శింబుపై మండిపడింది. రూ.50 లక్షల అడ్వాన్స్‌ని వడ్డీతో సహా కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామంటూ ఆర్డర్స్ జారీ చేసింది.