గెలుస్తారనుకుంటే ఏకంగా సిరీస్‌ సమర్పించుకున్నారు..

సమం చేస్తారని అంతా అనుకున్నారు.. వీరోచిత పోరాటంతో విజయం సాధిస్తారని భావించారు.. కానీ, అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకుంది కోహ్లీ సేన. బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యంతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్‌కు భంగపాటు ఎదురైంది. వరుసగా రెండు పరాజయాలు చవి చూసిన కోహ్లీసేన.. మూడో టెస్టులో అద్భుత విజయంతో అంచనాలు పెంచింది. ఆ తర్వాత సిరీస్‌ సమం చేసే అవకాశం వచ్చినా, చేజేతులా జారవిడుచుకుంది. ఫోర్త్‌ టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఘోర వైఫల్యం చెందడంతో 60 పరుగుల తేడాతో భారత్‌ ఓడింది. దీంతో ఇంగ్లండ్‌ 3-1తో సిరీస్‌ దక్కించుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని ఇంగ్లండ్‌ ముందుంచినా ఫలితం లేకపోయింది.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 96.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్‌ స్కోరుకు 11 పరుగులే చేయగలిగింది.. షమీ నాలుగు వికెట్లు తీశాడు. ఇక నాలుగో రోజు 245 పరుగుల లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 69.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. ఆరంభం నుంచే తడబడుతూ ఆడింది. 22 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌ బాట పట్టింది.. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ సింగిలి్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం కావడంతో భారత్‌ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు.. ఈ దశలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రహానే ఆదుకున్నారు.. సమన్వయంతో ముందుకు సాగి జట్టు ఇన్నింగ్స్‌ను పట్టాలెక్కించారు. బ్రేక్‌ తర్వాత కూడా కోహ్లీ, రహానె ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడారు. ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా లక్ష్యం వైపు కదిలారు. భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌ కోసమే ప్రయత్నించారు. విరాట్‌ కోహ్లీ 58 పరుగులు, రహానే 51 పరుగులు చేశారు.

టీ విరామం తర్వాత భారత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అతి తక్కువ సమయంలోనే పాండ్యాను స్టోక్స్‌ అవుట్‌ చేయగా పంత్‌… అలీకి చిక్కాడు. దీంతో భారత్‌ 4పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆఖరులో అశ్విన్‌ పోరాడినా ప్రయోజనం లేకపోయింది. కర్రాన్‌ చివరి వికెట్‌ పడగొట్టి ఇంగ్లండ్‌కు సిరీస్‌ అందించాడు. ఆఖరి టెస్టు ఈనెల 7 నుంచి లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జరగనుంది.