దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ పూలు, పండ్లతో అందంగా అలకరించారు. వేల సంఖ్యలో భక్తులు కన్నయ్య దర్శనం కోసం బారులు తీరారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రాలన్నీ ఉత్సవశోభతో వెలిగిపోతున్నాయి. ఇస్కాన్ ఆలయాలకు కూడా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి భజనలు చేస్తున్నారు. ఆలయాలకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ఉన్న శ్రీకృష్ణ జన్మస్థానం మధుర…. కృష్ణ భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునుంచే అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దాదాపు 3 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో కృష్ణావతారం ఎంతో ప్రత్యేకమైంది. ద్వాపరయుగంలో శ్రావణమాసం బహుళ అష్టమి రోజున చిన్నికృష్ణుడు జన్మించాడు. బుడిబుడి అడుగల ప్రాయం నుంచే పరమాత్ముడు చూపిన లీలలన్నీ మానవాళికి దిశానిర్దేశనాలయ్యాయి. ఆత్మయులకు అండగా నిలవడంతో, స్నేహానికి కొత్త అర్థం చెప్పడంలో, దుష్ట శిక్షణ చేయడంలో ఇలా చెప్పుకుంటూ పోతే.. కృష్ణతత్వాన్ని ఎన్ని రకాలుగా వర్ణించినా మాటలు తక్కువే అవుతాయి. కృష్ణుడంటే ఆనందం. కృష్ణుడంటే సంతోషం. అందుకే.. జన్మాష్టమిని ఊరూవాడా ఘనంగా జరుపుకుంటారు.

ఈ రోజు శ్రీకృష్ణుడికి వెన్న, పాలు, పెరుగు, అటుగులు, మీగడ లాంటివాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే.. ప్రతి ఇంటా చిన్ని కృష్ణుడి పాదాల్ని తీర్చిదిద్దుతారు. కన్నయ్య తమ లోగిళ్లలోకి రావాలని కోరుకుంటారు. తమ పిల్లల్ని కృష్ణుడి వేషధారణలో చూసుకుని మురిసిపోతారు. ఇక.. ఉట్టికొట్టే కార్యక్రమం ప్రతిచోటా చాలా గొప్పగా జరుగుతుంది. ముంబై లాంటి ప్రాంతాల్లో అయితే.. ఉట్టి కొట్టడం చూసి తీరాల్సిందే. కుర్రాళ్లంతా పిరమిడ్ ఆకారంలో ఏర్పడి అల్లంత ఎత్తున ఉన్న ఉట్టిని అందుకోవడం చూసి తీరాల్సిందే.