స్వప్న స్వర్ణం వెనుక రాహుల్ ద్రవిడ్ ‘వాల్’ సపోర్ట్..

స్వప్న బర్మన్ అంతకు ముందు ఆమె గురించి ఎవరికీ తెలియదు. ఓ మారుమూల పల్లెనుంచి వచ్చిన క్రీడా ఆణిముత్యం. నేడు భారత్‌కు బంగారు పతకం తీసుకువచ్చేసరికి ఆమె పేరు పతాక శీర్షికలకెక్కింది.

ఆమె ప్రతిభని కొనియాడుతూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో 68 ఏళ్ల నిరీక్షణ ఫలించి హెప్టథ్లాన్ విభాగంలో స్వర్ణం సాధించిన ఈ బెంగాల్ అమ్మాయి స్వప్న బర్మన్. తండ్రి రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తుంటే, తల్లి టీ తోటలో రోజువారీ కూలీగా పనిచేస్తూ బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది.

స్వప్నకి క్రీడలంటే ఆసక్తి ఉన్నా అందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీనికి తోడు తండ్రికి రెండు సార్లు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో స్వప్న తన కలలకి స్వస్తి చెప్పాలనే అనుకుంది. కానీ ఆమె ప్రతిభను గురించి తెలుసుకున్న రాహుల్ ద్రవిడ్ ఆర్థికంగా చేయూతనందించాడు.

 

ద్రవిడ్ మెంటార్ షిప్ కార్యక్రమం ద్వారా స్వప్నను మానసికంగా, శారీరకంగా ధృడం అయ్యే విధంగా శిక్షణ అందించాడు. స్వప్నతో పాటు మరో 19 అథ్లెట్లకు ‘వాల్ ఆఫ్ క్రికెట్’ పేరుతో ఆర్థికంగా సాయం అందించాడు. గో స్పోర్ట్స్ భాగస్వామ్యంతో ద్రవిడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల గ్రామాల్లోని క్రీడా ఆణిముత్యాల ప్రతిభను వెలికితీయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.