ఆ జిల్లాపై ఎప్పుడూ ప్రత్యేక ప్రేమ ఉంటుంది: చంద్రబాబు

CM, Chandrababu, Emotional Speech, Grama Darshini Program, east godavari, cm speech

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. రాష్ట్రంలోని విపక్షాలతో పాటు.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్ల కాలంలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామదర్శిలో ప్రజలకు వివరించారు.

గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లాపై తనకు ఎప్పుడు ప్రత్యేక ప్రేమ ఉంటుందన్నారు చంద్రబాబు. అందుకే ప్రభుత్వం ఏ పని చేసినా.. దాని ఫలాలు ఈ జిల్లాకు అందేలా చేస్తానని.. ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు తమ వెంటే ఉండాలని చంద్రబాబు కోరారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్‌.. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి, కోర్టులో చేతులు కట్టుకుని నిలబడి, బయటకొచ్చి తనను విమర్శిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. తనపై అవినీతి కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.

కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమస్థానంలో ఉన్నామని, ప్రభుత్వంపై నమ్మకంతో గంటలోనే రాజధాని బాండ్లు లిస్టయ్యాయని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

గ్రామదర్శినిలో ప్రజల కోరిక మేరకు.. చింతలపూడిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. యువ నేస్తం పథకం ద్వారా నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు.

కాపులకు కార్పొరేషన్‌ తీసుకొచ్చి వారికి అండగా నిలిచామని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. బీసీలు టీడీపీకి వెన్నెముక అని, వారి అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందన్నారు.

అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయని వివరించారు. కేంద్రం పూర్తిగా సహకరిస్తే ఇంకాస్త బాగుండేదన్నారు.

గ్రామదర్శిని సందర్భంగా ప్రభుత్వ పథకాల ప్రజలకు చేరుతున్నాయో లేదోనని చంద్రబాబు ఆరా తీశారు. 54 శాతం మాత్రమే లబ్ది చేకూరుతోందని తెలియటంతో డ్వాక్రా మహిళల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ గ్రామదర్శిని కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్‌, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.